
హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 13.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. దాని విలువ సుమారు రూ.13.3 కోట్లు ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో సోదాలు చేశామని తెలిపారు. ఓ మహిళా ప్యాసింజర్ చెక్-ఇన్ బ్యాగేజీని సెర్చ్ చేయగా..అందులో 20 ప్యాకెట్లలో హైడ్రోపోనిక్ గంజాయి దొరికిందని వివరించారు.
మొత్తం 13.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని..నిందితురాలిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశామన్నారు. ఆమెను కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ గంజాయి రిసీవర్ ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.