రాష్ట్రంలో కొత్తగా 13 మండలాల ఏర్పాటు

రాష్ట్రంలో కొత్తగా 13 మండలాల ఏర్పాటు

ఇప్పటికే నూతన జిల్లాలతో పాటు మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరికొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాలతో పలు జిల్లాలో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణ పేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లెలను మండలాలుగా మార్చారు. వికారాబాద్ జిల్లాలోని దుడ్యాల్, మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల, నిజామాబాద్ జిల్లాలోని ఆలూర్, డొంకేశ్వర్, సాలూర గ్రామాలను మండలాలు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో సీరోల్, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్, కామారెడ్డి జిల్లాలో డోంగ్లి,  జగిత్యాల జిల్లా ఎండపల్లి, జగిత్యాల జిల్లాలో భీమారం లను నూతన మండలాలుగా ఏర్పాటు చేశారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

కాగా నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. మొత్తం 9 గ్రామాలను కలుపుకుని గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేశారు. మండలాల పునర్విభజనలో భాగంగా ఆప్పట్లో గట్టుప్పల్ ను మండలంగా ప్రకటించిన ప్రభుత్వం తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ప్రత్యేక మండలం కోసం 892 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు గ్రామస్థులు. ఎట్టకేలకు మండలంగా మారడంతో  సీఎం కేసీఆర్ కు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.