హైదరాబాద్ లో మరో 12 మందికి పాజిటివ్.. టిమ్స్ లో ఐసోలేషన్

హైదరాబాద్ లో మరో 12 మందికి పాజిటివ్.. టిమ్స్ లో ఐసోలేషన్

హైదరాబాద్, వెలుగు: కరోనా ‘ఒమిక్రాన్’ వేరియంట్ కేసులు బయటపడిన 11 దేశాల నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిన మరో 12 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 12 మందిని గచ్చిబౌలిలోని టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐసోలేట్ చేశారు. ఇది వరకే పాజిటివ్ వచ్చిన ఓ మహిళతో కలిపి బాధితుల సంఖ్య 13కు చేరింది. 13 మంది శాంపిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని, ఫలితాలు రావాల్సి ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఎట్ రిస్క్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న దేశాల నుంచి శుక్రవారం నాటికి 909 మంది వచ్చారని తెలిపారు. రెండు రోజుల క్రితం పాజిటివ్ వచ్చిన మహిళ జీనోమ్ సీక్వెన్సింగ్ రిజల్ట్ శనివారం వచ్చే చాన్స్​ ఉందన్నారు.

ఒమిక్రాన్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ
కొత్త వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడానికి  సిద్ధంగా ఉన్నామని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ దవాఖాన్లలో 25,396 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేశామని పేర్కొంది. 8.16 లక్షల పీపీఈ కిట్లు, 43.14 లక్షల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌95 మాస్కులు, 3.74 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లు, 26.31 లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు, 2.42 లక్షల రెమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెసివిర్ ఇంజక్షన్లు సహా అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ప్రభుత్వ దవాఖాన్లలో 76, ప్రైవేటు దవాఖాన్లలో 39 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 135 టన్నుల (ఒక రోజుకు) నుంచి 327 టన్నులకు పెరిగిందని వెల్లడించారు.

ఇద్దరు మృతి
రాష్ట్రంలో శుక్రవారం 39,140 మందికి టెస్ట్ చేస్తే 198 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,76,574కు చేరిందని బులెటిన్‌‌‌‌లో అధికారులు పేర్కొన్నారు. వీరిలో 6,68,854 మంది కోలుకోగా.. మరో 3,723 యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు ఉన్నాయన్నారు. కరోనాతో మరో ఇద్దరు చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 3,997కి పెరిగిందని తెలిపారు.

మరోవైపు జనాలు వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇంట్రస్ట్ చూపకపోవడంతో వ్యాక్సిన్ స్టాక్ పేరుకుపోతోంది. రాష్ట్రంలో 57.72 లక్షల కొవిషీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 14.7 లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రభుత్వం స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫోకస్ పెట్టింది. సీఎస్ సోమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, డీహెచ్ శ్రీనివాసరావు వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న జిల్లాల్లో శుక్రవారం పర్యటించారు. అక్కడి ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి, టీకా వేయడంలో స్పీడ్ పెంచడానికి సూచనలు చేశారు.