- ఫోన్లో వీడియోలు తీసి బెదిరింపులు
- కర్నాటకలోని హుబ్లీలో దారుణం
హుబ్బళి: కర్నాటకలోని హుబ్బళిలో దారుణం చోటు చేసుకున్నది. 13 ఏండ్ల బాలికను ముగ్గురు మైనర్లు గ్యాంగ్‌రేప్ చేశారు. నిందితులంతా 14 నుంచి 15 ఏండ్ల మధ్యవాళ్లే అని పోలీసులు తెలిపారు. బాధితురాలికి ముగ్గురు బాలురు ముందు నుంచే తెలుసని వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలురు ఇంట్లోకి చొరబడ్డారు. తర్వాత ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
అక్కడ ముగ్గురు కలిసి బాలికను సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని నిందితులు తమ ఫోన్లలో వీడియో తీశారు. దీని గురించి ఎవరికైనా చెప్తే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బాలికను బెదిరించారు. అయితే, బాలిక ధైర్యం చేసి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు హుబ్బళి పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు హైస్కూల్ స్టూడెంట్లు కాగా, మరొకరు చదువు మధ్యలో ఆపేసినట్లు గుర్తించారు. వారు తీసిన వీడియో ఆధారాలను సేకరించేందుకు నిందితుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సహాయం అందజేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
