భార్య ట్రీట్​మెంట్​ కోసం సైకిల్​పై 130 కిలోమీటర్ల ప్రయాణం

భార్య ట్రీట్​మెంట్​ కోసం సైకిల్​పై 130 కిలోమీటర్ల ప్రయాణం
  • కేన్సర్​తో బాధపడుతున్న భార్యకు పుదుచ్చేరిలో ట్రీట్​మెంట్
  • 65 ఏండ్ల వయసులో తమిళనాడు కూలి సాహసం

చెన్నై: లాక్​డౌన్​ పేదల జీవితాలపై చాలా ప్రభావం చూపుతోంది. కేన్సర్​తో బాధపడుతున్న భార్యకు ట్రీట్​మెంట్​ ఇప్పించడానికి తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్​పై ఆమెను తీసుకుని వెళ్లాడు. తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా కుంభకోణానికి చెందిన అరివళగన్‌(65) రోజు కూలిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య మంజుల(60) కేన్సర్‌తో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించే స్థోమత లేకపోవడం, కుంభకోణం పరిసరాల్లో కేన్సర్‌కు వైద్యం అందించే స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు లేకపోవడంతో పుదుచ్చేరిలోని జిప్మర్‌ ఆస్పత్రికి వెళ్లాలని భావించారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఎటువంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో తన సైకిల్‌పై ఆమెను కూర్చోబెట్టుకుని మార్చి 30న సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరాడు. ఆమె సైకిల్​ పై నుంచి కింద పడిపోకుండా తన వెనకవైపు తాడుతో కట్టేసుకున్నాడు. మాయవరం, సీర్గాళి, చిదంబరం, కడలూర్‌ మీదుగా 130 కిలోమీటర్లు ప్రయాణించిన వారిద్దరూ అదే రోజు రాత్రి 10.15 గంటలకు జిప్మర్​ హాస్పిటల్​కు చేరుకున్నారు. ఒకే ఒక్కచోట మాత్రమే ఆగిన వారు.. ఒక గంట మాత్రమే రెస్ట్​ తీసుకున్నారు.

పెద్ద మనసు చాటుకున్న డాక్టర్లు
ఔట్​ పేషెంట్ డిపార్ట్​మెంట్, రీజినల్​ కేన్సర్​ సెంటర్​ను లాక్​డౌన్​ కారణంగా క్లోజ్​ చేయడంతో మొదట వారికి ట్రీట్​మెంట్​ చేసేందుకు జిప్మర్​ డాక్టర్లు అంగీకరించలేదు. ఆమెను సైకిల్‌పై ఇంతదూరం తీసుకువచ్చిన విషయం చెప్పడం.. మంజులకు కీమోథెరపీ చేయాల్సి ఉండటంతో డాక్టర్లు ట్రీట్​మెంట్​ ఇచ్చేందుకు అంగీకరించారు. అదే రోజు ఆమెకు ట్రీట్​మెంట్​ మొదలుపెట్టారు. అంతే కాక వారి నుంచి ఎటువంటి బిల్లు తీసుకోకుండా నెలకు సరిపడా మందులను అందించడమే కాకుండా.. సొంత ఖర్చుతో అంబులెన్స్​ ను సమకూర్చి వారిని స్వస్థలానికి పంపారు. దారి ఖర్చులకు మరికొంత డబ్బును వారికి అందించారు. లాక్​డౌన్​ పూర్తయిన తర్వాత మళ్లీ రావాలని వారికి సూచించిన డాక్టర్లు.. ఏదైనా అవసరం ఉంటే వెంటనే తమను సంప్రదించాలని అరివళగన్​కు చెప్పారు. అసలు తాను సైకిల్​పై 130 కిలోమీటర్లు ఎలా ప్రయాణించానో తనకే తెలియదని, తన భార్యను రక్షించుకోవాలన్న ఒకే ఒక్క కారణంతో ఈ ప్రయత్నం చేశానని అరివళగన్​ చెప్పాడు.