- 4 రోజులు నడపనున్న ఆర్టీసీ
- ఇందులో 400 స్పెషల్ బస్సులు
- జాతర రూట్లో అదనంగా మరో 900
హైదరాబాద్‌సిటీ, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 28 నుంచి జరిగే జాతర కోసం సోమవారం నుంచే ప్రత్యేక బస్సులు మొదలయ్యాయి. వీటిని ఈనెల 31వరకు నడపనున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రాజశేఖర్ తెలిపారు.
నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్‌క్రాస్ రోడ్స్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల నుంచి 400 బస్సులను నడిపిస్తున్నారు. ఈ బస్సులు ప్రయాణికులను జాతర గద్దెల వరకూ తీసుకెళ్తాయని అధికారులు తెలిపారు.
ప్రత్యేక బస్సులు ఆగే ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం టెంట్లు ఏర్పాటు చేసి తాగునీటిని అందుబాటులో ఉంచారు. తొక్కిసలాట జరగకుండా ఆయా రూట్లలో బస్‌లను కో ఆర్డినేట్ చేసేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. అలాగే, రోజూ గ్రేటర్లో నడిచే 3,200 బస్సుల్లో 900 వాహనాలను జాతర రూట్లలో నడపనున్నారు.
రేట్లు 50 శాతం అదనం
మేడారం వెళ్లే ప్రత్యేక బస్సుల్లో చార్జీలను 50శాతం పెంచినట్టు అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనే వర్తిస్తుందని చెప్పారు. 400 బస్సులను మేడారం జాతర కోసం నడుపుతున్న నేపథ్యంలో 5 రోజుల పాటు సిటీలోని కొన్ని రూట్లలో బస్సుల సంఖ్య తగ్గిస్తున్నట్టు తెలిపారు.
