మాల్యా, మోడీల నుంచి 13,100 కోట్లు వసూలు

మాల్యా, మోడీల నుంచి 13,100 కోట్లు వసూలు
  • పీఎంఎల్‌‌ఏ చట్టం కింద ఆస్తులను జప్తు చేశాం
  • ప్రకటించిన ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌

న్యూఢిల్లీ:  విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్‌‌ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్‌‌ మోడీ, ఇతని చుట్టం మెహుల్‌‌ చోక్సీ ఆస్తుల ద్వారా మరో రూ.792.11 కోట్ల బాకీలను స్టేట్‌‌ బ్యాంక్‌‌ నాయకత్వంలోని బ్యాంకుల కన్సార్షియం రికవరీ చేసుకుంది. మనీలాండరింగ్‌‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌‌ఏ) ప్రకారం వీరి ఆస్తులను సీజ్‌‌ చేశామని ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) శుక్రవారం ప్రకటించింది. వీటిలో కొన్ని ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని వెల్లడించింది. ఈ ముగ్గురి నుంచి ఇప్పటి వరకు వసూలు చేసిన ఆస్తుల విలువ రూ.13,109 కోట్లని తెలిపింది. దివాలా తీసిన కింగ్‌‌ఫిషర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌ యజమాని మాల్యా బ్యాంకుల కన్సార్షియానికి రూ.తొమ్మిది వేల కోట్లు బాకీ ఉన్నాడు. మోడీ, చోక్సీలు పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంకును రూ.13 వేల కోట్లకు మోసం చేశారు. ఈడీ ఇచ్చిన ఆస్తులను అమ్మడం ద్వారా ఇది వరకే ఈ కన్సార్షియానికి రూ.7,181.50 కోట్లు వచ్చాయి. ఈ ముగ్గురు   బ్యాంకులకు రూ.22,585 కోట్లు చెల్లించాలని ఈడీ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం కూడా ఈ సంస్థ వీరికి చెందిన రూ.3,644.74 కోట్ల విలువైన షేర్లను రూ.29.59 కోట్ల విలువైన స్థిరాస్తులను, రూ.54.33 కోట్ల విలువైన డీడీలను కన్సార్షియానికి అందజేసింది.