మహాలక్ష్మి పథకానికి కొత్తగా 1325 బస్సులు

మహాలక్ష్మి పథకానికి కొత్తగా 1325 బస్సులు

మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది.  ఈ ఏడాది జూన్​ నాటికి 1325 బస్సులను దశలవారీగా వాడకంలోకి తీసుకొచ్చేందుకు  సిద్దమైంది.   712 పల్లె వెలుగు, 400 ఎక్స్‌ ప్రెస్‌, 75 డీలక్స్‌, 138 లహరి/రాజధాని బస్సులున్నాయి. అందులోవాటిలో ఇప్పటికే కొన్ని బస్సులను వాడకంలోకి తెచ్చిన సంస్థ.. తాజాగా మరో 100 బస్సులను ప్రారంభించబోతుంది. 

కొత్తగా అందుబాటులోకి వస్తోన్న  100 బస్సుల్లో.. 90  ఎక్స్ ప్రెస్ బస్సులున్నాయి. ఇవి మహాలక్ష్మి-ఉచిత బస్సు ప్రయాణ స్కీంకు ఉపయోగపడనున్నాయి.  అలాగే, శ్రీశైలం ఘాట్‌ రోడ్డుకు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా  సంస్థ ప్రవేశపెడుతోంది. 11 మీటర్ల పొడువుగల ఈ ఏసీ బస్సుల్లో.. 36 సీట్ల సామర్థ్యం ఉంటుంది. శ్రీశైలానికి వెళ్లే భక్తులు సంస్థ అధికారిక వెబ్‌ సైట్‌ wwww.tsrtconline.in ద్వారా సీట్లను ముందస్తు రిజర్వేషన్‌  చేసుకోవచ్చు.

 ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర  శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్​ రెడ్డి  లాంఛనంగా ప్రారంభిస్తారు.  ఈ  కార్యక్రమంలో డిప్యూటీ సీఎం  మల్లు భట్టి విక్రమార్క , రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు  పొన్నం ప్రభాకర్‌ తో పాటు టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారు.