
- మొత్తం లక్షా 26 వేల 585 క్యూసెక్కులు దిగువకు..
- ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ నుంచి కొనసాగుతున్న వరద
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాలలోని జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో మంగళవారం ఈ ప్రాజెక్టు దగ్గర 14 గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందికి విడుదల చేశారు. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద వస్తున్నది. ఆల్మట్టి డ్యాం దగ్గర 517.25 మీటర్ల లెవెల్ నీటిని నిల్వ ఉంచుకొని.. లక్షా 15 వేల క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ డ్యామ్ కు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్ దగ్గర 490.75 మీటర్ల లెవెల్ నీటిని నిల్వ ఉంచుకొని 30 గేట్లను ఓపెన్ చేసి లక్షా 12 వేల 577 క్యూసెక్కుల నీటిని జూరాల డ్యామ్ కు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్ కు లక్షా 15 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా ఉన్నది.
జూరాల డ్యాం దగ్గర 317.640 మీటర్ల లెవెల్ నీటిని నిల్వ ఉంచుకొని, 14 గేట్లను ఓపెన్ చేసి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా 94,794 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 28,962 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్-–1 ద్వారా 1300 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ కు 770 క్యూసెక్కులు, రైట్ కెనాల్ కు 400 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింకు కెనాల్ కు 150 క్యూసెక్కులు మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి లక్షా 26 వేల 585 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు లక్షా 20 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా ఉన్నది.