కొత్త పింఛన్లు ఇచ్చేదెన్నడు?

కొత్త పింఛన్లు ఇచ్చేదెన్నడు?
  • కొత్త పింఛన్లు..ఇచ్చేదెన్నడు
  • ఇస్తామంటూ ఏడాదిలోనే 36 సార్లు సీఎం, మంత్రుల ప్రకటనలు
  • నాలుగేండ్లయినా అమలు కాని హామీ
  • వచ్చే నెల నుంచే వస్తాయని నిరుడు జులైలో చెప్పిన కేసీఆర్
  • గత మూడు రోజుల్లో రెండుసార్లు ఇదే మాట చెప్పిన కేటీఆర్​
  • ఏడాదిలో 15 సార్లు చెప్పుకొచ్చిన ఎర్రబెల్లి
  • 14 లక్షల మంది ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు:  ‘‘త్వరలో ఆసరా పింఛన్లు.. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మరో 15 రోజుల్లో పింఛన్లు..” ఇట్లా సీఎం కేసీఆర్​ మొదలు సంబంధిత శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు వరకు ఏడాది నుంచి 36 సార్లకుపైగా ప్రకటిస్తూ వచ్చారు. ఏదైనా మీటింగ్​ జరిగితే.. దీని గురించే చెప్తున్నారు. స్థానికంగా ప్రజలు నిలదీస్తారని ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలకు లెక్కే లేదు. కానీ.. ఇంతవరకు ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసింది లేదు. తీసుకున్న అప్లికేషన్లను పరిశీలించిందీ లేదు. నాలుగేండ్ల కింద ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ‘57 ఏండ్ల వాళ్లకు పింఛన్​’ హామీ ఇంతవరకు పట్టాలెక్కడం లేదు. ఆ నిబంధనతో సంబంధం లేని వాళ్లు కూడా పింఛన్​ కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది.
నిరుడు ఆగస్టు నుంచి అని చెప్పి..!

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 57 ఏండ్లు నిండినోళ్లకు కూడా ఆసరా పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో టీఆర్​ఎస్​ ప్రకటించింది. మళ్లీ అధికారంలోకి వచ్చాక రెండేండ్లు ఈ విషయాన్ని పక్కన పెట్టిన సీఎం కేసీఆర్.. నిరుడు జులై 4న రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. ‘‘57 ఏండ్లు నిండినోళ్లకు వచ్చే నెల నుంచే వృద్ధాప్య పింఛన్‌‌  ఇస్తం’’ అని ప్రకటించారు. 

ఆ లెక్కన 2021 ఆగస్టు నుంచే కొత్త పింఛన్ మంజూరు కావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. వృద్ధాప్య పింఛన్​ ఏజ్​ లిమిట్ ను 57 ఏండ్లకు తగ్గిస్తూ ఆగస్టులో జీవో జారీ చేసి అప్లికేషన్లు మాత్రం స్వీకరించారు.  ఆ తర్వాత అక్టోబర్ లో మరోసారి దరఖాస్తుకు చాన్స్ ఇచ్చారు. 10 నెలలుగా వాటిని పక్కన పెట్టేశారు.  సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మీటింగ్ కు పోయినా త్వరలో పింఛన్లు, వచ్చే నెలలో పింఛన్లు అంటూ ప్రకటిస్తున్నారు. నిరుడు జులై 10న ఖమ్మం జిల్లా పర్యటనలో ఆసరా పింఛన్ల సంబంధిత శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు.. 57 ఏండ్లు నిండినవాళ్లకు త్వరలో పింఛన్ ఇస్తామని ప్రకటించారు. అదే ఏడాది ఆగస్టు 9న అర్హులైన ప్రతి ఒక్కరికీ మూడు రోజుల్లో పింఛన్​ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉప ఎన్నిక జరిగిన హుజురాబాద్ లో కొందరికి తప్ప బయట ఒక్కరికీ మంజూరు కాలేదు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 28న వికారాబాద్‌‌‌‌‌‌‌‌లో కొత్త జెడ్పీ ఆఫీస్​కు భూమి పూజ చేసిన సందర్భంగా కొత్త పింఛన్లు మరో 15 రోజుల్లో  మంజూరు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. మార్చి 14న  బడ్జెట్ సెషన్ లో మాట్లాడుతూ.. నెల రోజుల్లో కొత్త పింఛన్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మార్చి 27న పాలకుర్తిలో దివ్యాంగుల శిబిరంలోనూ త్వరలో కొత్త పింఛన్లు ఇస్తామని తెలిపారు. అలాగే ఈ నెల 3న 5వ విడత పల్లె ప్రగతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో, ఈ నెల  9న  రంగారెడ్డి జిల్లా గొల్లూరులో మాట్లాడుతూ.. 57 ఏండ్లు నిండిన వృద్ధులకు త్వరలో పింఛన్ ఇస్తామన్నారు. మూడు రోజులు తిరగకముందే 12న కామారెడ్డిలో మాట్లాడుతూ వచ్చే నెలలోనే  కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పారు. ఇలా మంత్రి ఎర్రబెల్లినే  సుమారు 15 సార్లకుపైగా ప్రకటించారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 9న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బహిరంగసభలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ.. వచ్చే ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి కొత్త పింఛన్లను అందజేస్తామన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 14న మహబూబ్​ నగర్ జిల్లా జడ్చర్ల పర్యటనలో మాట్లాడుతూ.. త్వరలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 15న సిరిసిల్లలో ఇలాగే చెప్పారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. జులై, ఆగస్టు నెల నుంచి అందజేస్తామని కేటీఆర్​ ప్రకటించారు. 

ఏప్రిల్ 17న సంగారెడ్డిలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు మాట్లాడుతూ.. ‘‘ఈ నెల నుంచే కొత్తగా 10 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తం’’ అని ప్రకటించారు. ఈ నెల 6న నారాయణపేట పర్యటనలో మాట్లాడుతూ.. 57 ఏండ్లకే పింఛన్ ఇచ్చే కార్యక్రమం త్వరలో మొదలవుతుందన్నారు. ఈ నెల 16న కొడంగల్​లో మాట్లాడుతూ.. అతిత్వరలోఅర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు. ఇలా త్వరలో ఆసరా పింఛన్లు అంటూ ఏ నెలకు ఆ నెల దాటేస్తూ పోతున్నారు. ఏడాది కాలంలో ముఖ్యమంత్రి, మంత్రులంతా కలిపి ఇలా సుమారు 36 సార్లు  ప్రకటించగా.. ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలకు లెక్కే లేదు. 

14 లక్షల మంది ఎదురుచూపులు

నాలుగేండ్లుగా రాష్ట్ర సర్కారు కొత్త ఆసరా పింఛన్లను మంజూరు చేయడం లేదు. 57 ఏండ్లు నిండినోళ్లతోపాటు ఆ నిబంధనతో సంబంధం లేని  వాళ్లకూ పెన్షన్లను ఇవ్వట్లేదు. కొత్తగా దివ్యాంగులుగా, వితంతువులుగా మారినోళ్లు, 65 ఏండ్లు నిండినోళ్లు, గీత, చేనేత, బోదకాలు, ఒంటరి మహిళలు, హెచ్​ఐవీ పేషెంట్లు, బీడీ కార్మికులు కలిపి 3.50 లక్షల మందికి కొత్త పింఛన్లకు సంబంధించి ఆన్​లైన్​లో అప్రూవ్​ అయినట్లు చూపిస్తున్నా డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. 57 ఏండ్లు నిండినోళ్లందరికీ ఆసరా పింఛన్ల కోసం ఆగస్టు, అక్టోబర్​లో రెండుసార్లు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. దాదాపు 10.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ, సర్కారు ఇప్పటిదాకా వాటిని వెరిఫై కూడా చేయలేదు. నిరుడు అక్టోబర్ లో ఉప ఎన్నిక జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే కొత్త పింఛన్లను ఇచ్చింది. మొత్తంగా 14 లక్షల మంది పింఛన్​ కోసం 
ఎదురుచూస్తున్నారు. 

ఇగ వచ్చే.. అగ వచ్చే అంటున్నరు

57 ఏండ్లకే పింఛన్​ ఇస్తమని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన్రు. చాలా  ఆశపడ్డం..  సంబురపడ్డం.  కానీ, ఎప్పుడు అడిగినా ఇగ వచ్చే..  అగ వచ్చే అంటున్నరు. మాకు పింఛన్లు వచ్చేసరికి  మళ్లా ఎలక్షన్లు వచ్చేటట్టు ఉన్నయ్​.  మొన్న  ఉప ఎన్నికలప్పుడు ఇచ్చినట్టే చేసిన్రు.. మళ్లా సప్పుడు లేదు. సర్కార్  హామీ ఇచ్చినప్పుడే నాకు 57 ఏండ్లు. ఇప్పుడు 60 దాటిన. జర జల్ది ఇస్తే బాగుండు.
- రంపీస రాజీరు, శ్రీరాములపల్లి, ఇల్లందకుంట, కరీంనగర్ జిల్లా


3.30 లక్షల పింఛన్లు తీసేసిన్రు

చనిపోయారని, ఊర్లో ఉంటలేరని, వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోలేదని కారణాలు చూపెట్టి ఆసరా పింఛన్ల జాబితాలో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు తొలగిస్తున్నది. ఇలా నెలనెలా సుమారు 6 వేల నుంచి 8 వేల మంది పేర్లను తీసేస్తున్నది. ఒక్క 2019లోనే ఆసరా జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిన పింఛన్ల సంఖ్య 1,16,534. ఆ ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్​లో ఒకేసారి 52,082 మంది పేర్లను తీసేసింది.  రెండోసారి అధికారంలోకి వచ్చాక గడిచిన నాలుగేండ్లలో వివిధ కారణాలతో 3.30 లక్షల ఆసరా పింఛన్లను తొలగించారు. దీంతో రాష్ట్రంలో 2018 ఆగస్టు నాటికి ఆసరా పింఛన్​ లబ్ధిదారుల సంఖ్య 39,42,371గా ఉంటే.. మే 2022 నాటికి ఆ సంఖ్య 36.10 లక్షలకు పడిపోయింది. తొలగించిన వారి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త వాళ్లకు ఇచ్చే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్నా 


నా భర్త కుమార్ నాలుగేండ్ల కింద గుండెపోటుతో చనిపోయిండు. మాకు పిల్లలు లేరు. బస్టాండ్ సెంటర్ లో ఒక హోటల్ పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్న.  నా భర్త చనిపోయిన తర్వాత వితంతు పింఛన్  కోసం దరఖాస్తు చేసిన. ఇప్పటికీ నాలుగేండ్లు గడుస్తున్నా పింఛన్​ వస్తలేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది.  ప్రభుత్వం వెంటనే పింఛన్లు ఇవ్వాలి. 


- లక్ష్మీవిలాస్ మంగమ్మ, మునగాల, సూర్యాపేట జిల్లా 


పనికి పోదామంటే శాతనైతలే.. 

నా భర్త రెండున్నరేండ్ల కింద చనిపోయిండు. రెండేండ్ల కింద వితంతు పింఛన్​ కోసం దరఖాస్తు చేసుకున్న. అప్పటి నుంచి ఎదురుచూస్తున్న గానీ వస్తలేదు.  నేను పనికి పోదామంటే శాతనైతలేదు. నెల నెలా దవాఖానకు పోతానికి అప్పు చేసి మందులు తెచ్చుకుంటున్న. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు ఫించన్ మంజూరు చేయాలె. 


- గంగుల ఎల్లవ్వ, ధర్మారం, రాజన్న సిరిసిల్ల 

ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు

రాష్ట్ర సర్కార్ 2018 జులై నుంచి కొత్త పింఛన్లు ఇవ్వటం లేదు. సంక్షేమ రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలో నాలుగేండ్లుగా ఇలా చేయడం దారుణం. దరఖాస్తు చేరుకున్న వాళ్లు ఏ రోజు నుంచి పింఛన్​కు అర్హులో ఆ రోజు నుంచి వారికి బకాయిలతో సహా ఇవ్వాలి. దేశంలో అన్ని విషయాల మీద స్పందించే మంత్రి కేటీఆర్​ పెండింగ్ పింఛన్ల గురించి ట్విట్టర్ లో స్పందించరు ఎందుకో మరి?  రాష్ట్రంలో దాదాపు 14  లక్షల మంది అర్హులు పింఛన్​ కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. 

- బి.కొండల్ రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక