సంచుల్లో 14 టన్నుల కుళ్లిన మాంసం హైదరాబాద్ మంగళ్హాట్ లో పట్టుకున్న టాస్క్ఫోర్స్

సంచుల్లో 14 టన్నుల కుళ్లిన మాంసం హైదరాబాద్ మంగళ్హాట్ లో పట్టుకున్న టాస్క్ఫోర్స్
  • 20 రోజుల వ్యవధిలోనే మళ్లీ అదే షాపులో భారీగా పట్టుబడ్డ కుళ్లిన మాంసం 
  • ప్రత్యేకంగా ఫ్రీజర్ గోదాం ఏర్పాటు చేసుకుని వ్యాపారం
  • మేక, గొర్రె తలకాయలు, కాళ్లు కూడా.. 
  • సంచుల్లో, ప్లాస్టిక్ పెట్టెల్లో రసాయనాలు కలిపి నిల్వ  
  • మహారాష్ట్ర, కర్నాటక, జమ్మూ ప్రాంతాల నుంచీ చనిపోయిన మేకల మాంసం ఇక్కడికే
  • ఫైన్ ​వేసి వదిలేస్తుండడంతో రెచ్చిపోతున్న కల్తీ ఫుడ్ వ్యాపారులు

హైదరాబాద్​సిటీ/ మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మాంసం వ్యాపారి గోదాంలో 14  వేల కిలోల కుళ్లిన మాంసాన్ని పట్టుకున్నారు. మంగళ్ హాట్ పోలీసులు, గోల్కొండ టాస్క్ ఫోర్స్, హెచ్ ఫాస్ట్ టీమ్, జీహెచ్ ఎంసీ ఆఫీసర్లు తనిఖీలకు వెళ్లగా అక్కడి దృశ్యాలను చూసి షాక్​కు గురయ్యారు. ఎటువైపు పోతున్నా.. ఏది ముట్టుకున్నా.. ఏ సంచి ఓపెన్​చేసిన కుళ్లిన మాంసం.. ప్యాకెట్లలో మటన్​ముద్దలు కనిపించడంతో నివ్వెరపోయారు. 

ఒక్కొక్క సంచిని ఓపెన్​చేస్తూ పోగా చివరకు అది 14 వేల క్వింటాళ్లుగా తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత నెల మార్చి12 న ఇదే వ్యాపారి గోదాంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 300 కిలోల కుళ్లిన మాంసాన్ని పట్టుకున్నారు. అప్పుడు అరెస్ట్​చేసి జరిమానా విధించినా మళ్లీ అదే దందా చేస్తూ పట్టుబడ్డాడు.  

చచ్చిన మేక, గొర్రెలను తెచ్చి..

మహమ్మద్ అఫ్రోజ్  ‘ఏ టూ జెడ్ షీప్ అండ్ గోట్స్ ఆఫల్స్’ పేరుతో ఆర్‌‌‌‌‌‌‌‌ కే పేట్ చిస్థి చమాన్ ప్రాంతంలో మేకలు, గొర్రెల మాంసం అమ్ముతుంటాడు. మహారాష్ట్ర, కర్నాటక, జమ్మూ ప్రాంతాల నుంచి చనిపోయిన, కుళ్లిపోయిన, మేక, గొర్రెల మాంసాన్ని గుత్తగా తక్కువ ధరకు తీసుకువస్తాడు. అలాగే, సిటీలోని కబేళాల్లో చనిపోయిన మేకలు, గొర్రెలను కూడా తీసుకువస్తాడు. 

ఇక్కడ కోల్డ్​స్టోరేజీ గోదాం ఏర్పాటు చేసుకుని అందులో డీప్ ఫ్రీజర్లు, కెమికల్స్​కలిపిన నీటిని నింపిన డ్రముల్లో, ప్లాస్టిక్ టబ్బుల్లో, సంచుల్లో మూట కట్టి నిల్వ చేశాడు. దుర్వాసన రాకుండా రకరకాల కెమికల్స్​కలిపేవాడు. తన షాపుకు వచ్చే వారికి తాజా మాంసం అంటూ  హోల్​సేల్​గా అమ్మేవాడు. ఇదే మాంసాన్ని సిటీలోని  మటన్​ షాపులు, ప్రధాన హోటల్స్, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నాడు. కిలోకు రూ.500 కంటే తక్కువకే అమ్ముతుండడంతో ఎగబడి కొంటున్నారు.  మేక కాళ్లు, తలకాయలను కూడా  తక్కువకే విక్రయిస్తున్నాడు. 

ఎక్కడ చచ్చినా అఫ్రోజ్ కే ఫస్ట్​ ఫోన్​కాల్

నగరంలో కానీ, వివిధ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా మేకలు, గొర్రెలు చనిపోతే మొదట అఫ్రోజ్​కే కాల్​వస్తుంది. ఆ మాంసాన్ని వాహనాల్లో తీసుకువచ్చి కెమికల్స్​కలిపి నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా భారీ గోదాం ఏర్పాటు చేసుకున్నాడు. అధికారులు తనిఖీలు చేసిన సమయంలో ఈ గోదాంలో కుళ్లిన మాంసం ఉన్న సంచులు గుట్టలు, గుట్టలుగా కనిపించాయి. ప్లాస్టిక్ పెట్టెల్లో మేక, గొర్రెల మాంసం, మేక కాళ్లు, బోటి, ఫంగస్ వచ్చి దుర్వాసన వెదజుల్లుతూ ఉన్నాయి. 

ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నప్పుడు దుర్వాసన భరించలేక మాస్కులు పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఆఫీసర్లు తనిఖీకి వచ్చారని తెలుసుకున్న ఓనర్ మహ్మద్ అప్రోజ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుళ్లిన మాంసాన్ని బయటకు తీసుకువస్తున్న టైంలో షాపులో పనిచేసే ఓ వ్యక్తి కావాలంటే ‘వీటి శాంపిల్స్ చెకింగ్ కు తీసుకెళ్లండి..  జరిమానా వేసుకోండి’ అంటూ దురుసుగా మాట్లాడాడు. ఈ ఘటన వెలుగు చూడడంతో నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లలో నోరూరించే బిర్యానీ, మటన్, చికెన్ వంటకాలు తినేవారు భయానికి గురవుతున్నారు. 

పరిగిలో 35 కిలోల కుళ్లిన మాసం

పరిగి వెలుగు :  పరిగిలోని విద్యానగర్​కు చెందిన మహ్మద్​ మటన్​షాప్​లోనూ టాస్క్ ఫోర్స్ ఇన్‌‌‌‌స్పెక్టర్ ఎస్‌‌‌‌కే అన్వర్ పాషా ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 35 కిలోల​ కుళ్లిన మాంసాన్ని పట్టుకున్నారు. దీనిని నిల్వ ఉంచుతూ అమ్ముతున్నట్లు గుర్తించారు. తక్కువ ధరకే ఇస్తుండడంతో జనాలు ఎగబడి కొంటున్నారని తెలుసుకున్నారు.