ఒక్కడి వల్ల 14 గ్రామాలు సీజ్

ఒక్కడి వల్ల 14 గ్రామాలు సీజ్
  • మసీదులో ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్
  • గత నెల తబ్లిగి జమాత్​కు హాజరైనట్టు సమాచారం

లక్నో: ఒకే ఒక్క వ్యక్తి కారణంగా ఉత్తరప్రదేశ్​లో 14 గ్రామాలను అధికారులు సీజ్​ చేసేశారు. ఓ వ్యక్తి బదౌన్​ జిల్లాలోని భవానీపూర్​ ఖాలీ ఏరియాలోని ఓ మసీదులో ఉంటున్నాడు. గత నెల ఢిల్లీలో జరిగిన తబ్లిగి జామాత్​ సదస్సుకు అతను హాజరయ్యాడు. శనివారం అతడికి కరోనా వైరస్​ పాజిటివ్​ వచ్చింది. దీంతో ఆ జిల్లాల్లోని మొత్తం 14 గ్రామాలను అధికారులు క్వారంటైన్​లో పెట్టారు. ‘‘ఒక వ్యక్తికి కరోనా రావడంతో జిల్లా అధికారులు అతడు ఉన్న గ్రామానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న14 గ్రామాలను సీల్​ చేసేశారు. మొత్తం 14 గ్రామాలు క్వారంటైన్​లో ఉన్నాయి”అని జిల్లా కలెక్టర్​ కుమార్​ ప్రశాంత్​ తెలిపారు. కాగా, సోమవారం ఆగ్రాలో మరో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 134కు చేరింది. ఇందులో 60 మంది తబ్లిగికి చెందిన వారే అని అధికారులు చెప్పారు.