ఆ ఐదుగురిది ఆత్మహత్యే!. మియాపూర్ ఘటనలో పోలీసుల అనుమానాలు

ఆ ఐదుగురిది ఆత్మహత్యే!. మియాపూర్ ఘటనలో పోలీసుల అనుమానాలు

 

  • పెరుగన్నంలో ఎలుకల మందు కలిపి తినడంతోనే మృతి చెందినట్టు పోస్టుమార్టం రిపోర్ట్
  • లక్ష్మయ్య అనారోగ్యం, రెండో అల్లుడి ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్న పోలీసులు
  • అర్ధరాత్రి తల్లిదండ్రుల ఇంటికి వచ్చి వెళ్లిన పెద్ద కుమార్తె పైనా అనుమానం
  • అదుపులోకి తీసుకొని విచారణ


మియాపూర్, వెలుగు: మియాపూర్​మక్త మహబూబ్​పేట్​లో గురువారం ఒకే ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఐదుగురిది ఆత్మహత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి మృతికి విష ఆహారమే కారణమని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఎలుకల మందు కలిపిన పెరుగన్నం తినడం వల్లే వృద్ధ దంపతులు, రెండో కుమార్తె, అల్లుడు, వారి మనుమడు చనిపోయినట్టు తెలిసింది. లక్ష్మయ్య అనారోగ్యం, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం, రెండో అల్లుడికి ఊర్లో అప్పులు ఉండడంతో అందరూ కలిసి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మక్త మహబూబ్ పేట్ లో ఓ అద్దె ఇంట్లో కర్నాటకకు చెందిన ఉప్పరి లక్ష్మయ్య(61), వెంకటమ్మ(55) దంపతులు, కవిత(24), అనిల్(32)​, రెండేండ్ల మనుమడు యువాన్ష్​గురువారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో సేకరించిన శాంపిల్స్​ను ఫోరెన్సిక్​ ​ల్యాబ్​కు  పంపించారు. 45 రోజుల్లో ఫోరెన్సిక్​ రిపోర్టు వస్తుందని, రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని మియాపూర్​ ఇన్​స్పెక్టర్​ శివ ప్రసాద్ తెలిపారు. గురువారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత డెడ్​బాడీలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

పెద్ద కుమార్తెపై అనుమానాలు 

బుధవారం రాత్రి వెంకటమ్మ పెద్ద కుమార్తె లక్ష్మికి ఫోన్ చేసి తనకు నీరసంగా ఉందని చెప్పడంతో లక్ష్మి తన భర్త చాంద్ పాషాతో కలిసి తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం రాత్రి 11 గంటలకు తన భర్తతో కలిసి తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. పెద్ద కుమార్తె లక్ష్మి వచ్చి వెళ్లిన తరువాతే ఈ ఘటన జరగడంతో లక్ష్మి, చాంద్​పాషాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో మియాపూర్ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. గురువారం రాత్రి సొంతూరిలో తల్లిదండ్రుల అంత్యక్రియలు ఉండడంతో లక్ష్మిని పంపించగా.. చాంద్​పాషా పోలీసుల అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఘటన జరిగిన ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా లక్ష్మి ఇంటికి వచ్చి వెళ్లే ముందు ఎలాంటి వస్తువులు, ఆహార పదార్థాలు తీసుకువచ్చిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం మరోసారి లక్ష్మి, చాంద్​పాషాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలిసింది. కాగా, పెద్ద కుమార్తె లక్ష్మి వచ్చి వెళ్లిన తర్వాత ఐదుగురు కలిసి భోజనం చేశారా? అంతకు ముందే తిన్నారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే, కుటుంబసభ్యుల్లో ఎవరు ఎలుకల మందు ప్యాకెట్లు తీసుకొచ్చారు? పెరుగన్నంలో వాటిని ఎవరు కలిపారు? అందరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?  లేకపోతే ఒక్కరే ఆహారంలో ఎలుకల మందు కలిపి అందరి మృతికి కారణమయ్యారా? కుమారుడు భగవంత్ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నారా? వంటి అనేక విషయాలు  మిస్టరీగానే మిగిలాయి.

ఆర్థిక ఇబ్బందులే ?

కొంతకాలం కింద లక్ష్మయ్య కాలికి గాయమవడంతో పనికి వెళ్లడం లేదు. వెంకటమ్మ మాత్రమే స్కూల్​లో అటెండర్​గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. రెండో అల్లుడు అనిల్ సొంత గ్రామంలో అప్పులు చేసి కుటుంబ సభ్యులతో గొడవపడి 2నెలల కిందట భార్య, కొడుకుతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్​కు వచ్చాడు. కొన్ని రోజులు హజీజ్​నగర్ లో భార్యతో కలిసి కూలీ పనులు చేసి ఆరు రోజుల క్రితం మక్త మహబూబ్ పేటలో ఉంటున్న అత్తగారింటికి వచ్చారు. లక్ష్మయ్యకు ఆరోగ్యం బాగలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వడం, రెండో అల్లుడు అనిల్ కు కూడా సొంత గ్రామంలో అప్పులు ఉండడంతో చిన్న బాబు తో కలిసి ఐదుగురూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని అనేది తెలియాల్సి ఉంది. అయితే, ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం ఉంటే అనిల్​అద్దెకు ఉండేందుకు గదిని ఎందుకు చూసుకున్నాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.