
కొల్లాపూర్/అమ్రాబాద్, వెలుగు : తెలంగాణలో త్వరలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. పర్యాటకులను ఆకట్టుకునేలా హెలీ టూరిజం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా ఈజ్ మై ట్రిప్ సంస్థ సహకారంతో హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం మీదుగా హైదరాబాద్‌కు హెలిటూరిజం నిర్వహణకు ప్రపోజల్స్ రెడీ చేస్తున్నామన్నారు. ఇది పూర్తయితే తెలంగాణ పర్యాటక రంగం కొత్తమలుపు తిరుగుతుందన్నారు. సోమశిల వెల్‌నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్ట్, అమరగిరి ఐల్యాండ్ వెల్‌నెస్ రిట్రీట్, సోమశిల వీఐపీ ఘాట్ బోటింగ్ పాయింట్ ట్రెంచింగ్ పనులతో పాటు ఈగలపెంట వద్ద అరైవల్ జోన్, ప్రొమెనెడ్, రివర్ క్రూయిజ్ నోడ్, చెంచు మ్యూజియం పనులకు గురువారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రాజెక్ట్‌లు చేపడుతోందన్నారు. నల్లమల అందాలను ప్రపంచానికి పరిచయం చేస్తామని, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు మౌలిక వసతుల కల్పనతో పాటు విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉద్యోగ కల్పనతో పాటు మౌలిక వసతులు మెరుగవుతాయన్నారు. సోమశిల, అమరగిరిలో వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ టూరిజానికి పెద్దపీట వేస్తామన్నారు. సోమశిల- – సిద్దేశ్వరం ఐకానిక్ బ్రిడ్జి పూర్తయితే దూరాభారం తగ్గడంతో పాటు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోశ్ పాల్గొన్నారు.