
Market Fall: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో డీలా పడ్డాయి. ప్రధానంగా ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగం తర్వాత జీఎస్టీ రిలీఫ్ జోరుతో పాటు కొనసాగిసిన లాభాల జోరు 6 రోజుల గెయిన్స్ తర్వాత ఆవిరయ్యాయి. ఉదయం 10.48 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 570 పాయింట్ల నష్టంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 175 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ 495 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది.
ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ఇంట్రాడేలో నష్టపోయి మార్కెట్లను కిందికి లాగుతున్నాయి. అయితే మార్కెట్లు అనూహ్యంగా రివర్స్ ట్రెండ్ లోకి రావటానికి కీలక కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
* ముందుగా వారాంతంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగటం సూచీలను నష్టాల్లోకి నెట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ నుంచి తమ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యేందుకు భారీగా అమ్మకాలకు దిగటంతో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని చూశాయి. జీఎస్టీ తగ్గింపు వార్తలతో పాటు భారత రేటింగ్ ను ఎస్ అండ్ పి అప్ గ్రేడ్ చేయటంతో కొనసాగిన ర్యాలీకి అమ్మకాలు బ్రేక్ వేశాయని నిపుణులు అంటున్నారు.
* ఇక ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తోంది సెప్టెంబరులో జరగనున్న యూఎస్ మానిటరీ పాలసీ సమావేశం గురించి. అయితే శుక్రవారం రోజున యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తన జాక్సెన్ హోల్ ప్రసంగంలో ఏం మాట్లాడతారనే ఉత్కంఠ కూడా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ప్రసంగం సెప్టెంబర్ ఫెడ్ మీటింగ్ నిర్ణయాలకు ఒక సూచికగా ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు.
* ఇక మార్కెట్ల పతనానికి దారితీసిన మరో కీలక అంశం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన 25 శాతం అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి రావటమే. ఇంకా డెడ్ లైన్ కి కనీసం వారం రోజులుకు కూడా సమయం లేకపోవటం సుంకాల నిరోధానికి ఎలాంటి చర్చలు జరగకపోవటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే దీని కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన 30 బేసిస్ పాయింట్ల కంటే ఇంకా దిగజారవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ నిపుణులు వికె విజయకుమార్ తన అంచనాలను పంచుకున్నారు.
*చివరిగా మార్కెట్ల పతనంలో మరో కీలక పాత్ర పోషించింది రూపాయి పతనం. అమెరికా డాలర్ తో పోల్చితే భారత రూపాయి మారకపు విలువ 11 పైసలు పడిపోయి రూ.87.36కి చేరుకోవటం విదేశీ చెల్లింపులను ఖరీదైనది మార్చుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అయితే తగ్గుతున్న క్రూడ్, విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు ఒత్తిడిని తగ్గిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.