ప్రజాభవన్​ ప్రజావాణికి  1,428 ఫిర్యాదులు

ప్రజాభవన్​ ప్రజావాణికి  1,428 ఫిర్యాదులు

పంజాగుట్ట, వెలుగు : బేగంపేట మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1,428 ఫిర్యాదులు అందాయి. వీటిలో హౌసింగ్ కు సంబంధించి 397, రెవెన్యూ డిపార్ట్​మెంట్​కు 350, సివిల్​సప్లైకు 114 ఫిర్యాదులు వచ్చాయి. మిగతా 567 ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. భూ సమస్యలు తీర్చాలని, ఇండ్లు, రేషన్​కార్డులు ఇవ్వాలని కోరుతూ పలువురు అర్జీలు అందజేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, నోడల్​అధికారి దివ్యదేవరాజన్ ఫిర్యాదులు స్వీకరించారు.  

బెల్లంపల్లికి చెందిన ఆరోపల్లి పద్మ తాను బతికుండగానే చనిపోయినట్లు తన పిన్ని లక్ష్మి డెత్​సర్టిఫికెట్​తీసుకుందుని ఫిర్యాదు చేసింది. తన తండ్రి మృతి అనంతరం వచ్చిన ఉద్యోగాన్ని, ప్రభుత్వం డబ్బును కాజేసిందని పేర్కొంది. అలాగే జీఓ నంబర్లు 81, 85 ప్రకారం 3,797 మంది వీఆర్ఏల(61 ఏండ్లు పైబడినవారు) వారసులకు వెంటనే నియామక ఉత్తర్వులివ్వాలని పలువురు కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.  డీఎస్సీ–2012లో ఎంపికై, సవరణల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్​అభ్యర్థులకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్​కుమార్​అనే వ్యక్తి కోరారు. ప్రజావాణిలో వినతి అందంజేశారు.