
కేరళ వయనాడు జిల్లాలో రెండో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కొండ చరియలు విరిగిపడ్డ మెప్పాడితో పాటు ఇతర ప్రాంతాల్లో NDRF, కేరళ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 143కు చేరింది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతోంది.
కేరళ వయనాడు జిల్లాలో జూలై 30 తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడి.. వరద పోటెత్తడంతో వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. మెప్పాడి, ముండకై, చురల్ మల, అట్టమాల, నూల్పుజ గ్రామాల్లో చాలా మంది చనిపోయారు. ఇండ్లలో పడుకున్న చోటే కొందరు సజీవ సమాధి అయ్యారు. చురల్ మల, ముండకై గ్రామాలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. మరికొన్ని గ్రామాలు సగం బురదలో కూరుకుపోయాయి. ఎటూ చూసినా, బురద, బండరాళ్లే కనిపిస్తున్నాయి. వందలాది వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. చలియార్ నదిలో పదుల సంఖ్యలో డెడ్ బాడీలు గుర్తించారు. నిన్న వందల మందిని రెస్యూ చేసి ఆస్పత్రులకు తరలించారు. ఇంకా చాలా మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. వీరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
మండకై ప్రాంతంలోని టీ, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు బెంగాల్, అసోం నుంచి వందలాది మంది కార్మికులు వచ్చారు. వీరిలో 600 మంది ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. వీరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళలో మరో 2, 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. వయనాడు జిల్లాలో వర్షం కురుస్తోంది. మరో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు కేరళ సర్కార్ 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. తిరువనంతపురంలో అసెంబ్లీలో జాతీయ జెండాను సగం వరకు ఎగరేశారు.
మరోవైపు అరేబియా సముద్రం వేడెక్కడంతోనే కేరళలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. చాలా తక్కువ టైంలో దట్టమైన మేఘాలు ఏర్పడడంతో వయనాడు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. అవి వరద పోటెత్తడానికి, కొండ చరియలు విరిగిపడడానికి కారణమయ్యాయని తెలిపారు.