
పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీల లెక్క తేలింది. మొత్తం 1,450 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ రిపోర్టును త్వరలోనే ప్రభుత్వానికి అందచేయనున్నారు. ఈ మధ్యే పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీల లెక్క తేల్చాలని, అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మొత్తం ఖాళీలలో సగం పంచాయతీ కార్యదర్శులే ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి జడ్పీ సీఈవో వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలోనే వీటిని పదోన్నతులతో భర్తీ చేయనున్నారు. దీంతో గత 20 ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు, అధికారులకు త్వరలోనే పదోన్నతులు రానున్నాయి. ఇటీవల 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసినప్పటికీ నాన్ లోకల్ సమస్య, వేరే ఉద్యోగాలు వచ్చిన వాళ్లు, ఉద్యోగం వచ్చినా.. చేరని వాళ్లు మొత్తం కలిపి 1,150 వరకు ఉన్నారు. వీటిని కూడా కలిపి పంచాయతీ రాజ్ శాఖలో మొత్తం 2,600 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు శాఖలో 311 పోస్టుల భర్తీకి గురువారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.