4సార్లు ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌: టెక్ తొలగింపుల వెనుక అసలు కారణం ఇదే!

4సార్లు ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌: టెక్ తొలగింపుల వెనుక అసలు కారణం ఇదే!

గత కొన్నేళ్లుగా టెక్ ప్రపంచంలో ఉద్యోగాల కోత గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కరోనా లాక్ డౌన్ తరువాత లక్షల మంది  ఉద్యోగాల కోతతో రోడ్డున పడ్డారు. అయితే ఒక్కసారి కాదు నాలుగుసార్లు ఉద్యోగకోతకు బలైన 59 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ మార్క్ క్రిగుయర్ కి టెక్ ప్రపంచంలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది. అతను తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూశానని,  గత 18 ఏళ్లలో నాలుగు సార్లు ఉద్యోగం కోల్పోయినట్లు చెప్పారు. అయితే కొంతకాలం క్రితం వాల్‌మార్ట్ తోలగించిన 1,500 మంది ఉద్యోగులలో ఆయన కూడా ఉన్నారు.

మార్క్ క్రిగుయర్ తనకు జరిగిన అనుభవాలను చెప్పుకుంటూ తన పదేళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకున్నానని, 2008లో సన్ మైక్రోసిస్టమ్స్ సంస్థలో మొదటిసారి తన ఉద్యోగం పోయిందని, తర్వాత కోవిడ్-19 సమయంలో  దాని తరువాత మరో కంపెనీలో కూడా ఉద్యోగం కోల్పోయినట్లు చెప్పారు. 

టెక్ రంగంలో వస్తున్న తొలగింపులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు)  కారణం కాదని, అయితే చాలా ఉద్యోగ అవకాశాలలో ఇప్పుడు AI స్కిల్స్ ఒక అర్హతగా ఉంటుందని, భవిష్యత్తులో ఇది తప్పనిసరి కావచ్చు అని అన్నారు.  

మార్క్ క్రిగుయర్ ప్రకారం  ఉద్యోగ తొలగింపులకు అసలు కారణం కంపెనీలు చాలా వేగంగా ఉద్యోగులను నియమించుకోవడం, దీనికి వెంచర్ క్యాపిటల్ ఒత్తిళ్లు, టెక్ ఉద్యోగుల అధిక జీతాలు కారణమని చెప్పుకొచ్చారు. ఆయన ప్రకారం తొలగింపులు కొత్త టెక్నాలజీ వల్ల కాకుండా అవసరానికి మించి ఉద్యోగులను తీసుకోవడం వల్ల అని అన్నారు. 

ఎన్ని కష్టాలు ఎదురైనా ఆశలు కోల్పోకుండా, ఇప్పటికి దాదాపు 40 ఉద్యోగాలకు అప్లయ్ చేసుకుని, 15 ఇంటర్వ్యూలకు వెళ్లానని అన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ రంగం గతంలో అంత వేగంగా విస్తరించకపోయినా, ఇంకా అవకాశాలు ఉన్నాయని  చెప్పారు. అనుభవం, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం ఉన్నవాళ్ళకి నేటి టెక్ ప్రపంచంలో మంచి డిమాండ్ ఉందని ఆయన చెబుతున్నారు.