
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు శనివారం(ఆగస్టు 2) జీవిత ఖైదు విధించింది. రేవణ్ణకు జీవిత ఖైదుతో పాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించారు. బాధితుడికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. రేవణ్ణ అరెస్టు అయిన దాదాపు 14 నెలలుగా దర్యాప్తు కొనసాగింది. తర్వాత విచారణ ప్రారంభమైన ఎనిమిది వారాల్లో న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ ఈ తీర్పునిచ్చారు.
విచారణలో భాగంగా శుక్రవారం (ఆగస్టు1) కేసును విచారించిన బెంగళూరు ప్రత్యేక కోర్టు 47 ఏళ్ల పనిమనిషిపై రేవణ్ణ అత్యాచారం చేసినట్లు దోషిగా తేల్చింది. రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపులు, లైంగిక దృశ్యాలను చూడటం, సాక్ష్యాలను నాశనం చేయడం,సమాచార సాంకేతిక చట్టం కింద నేరాలు రుజువయ్యాయి.
2024లో రేవణ్ణ హసన్ నియోజకవర్గంలో వందలాది అసభ్యకరమైన వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌లు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే రేవణ్ణ జర్మనీకి పారిపోయాడు. ఎన్నికల తర్వాత అతను దేశానికి తిరిగి వచ్చాడు.మే 31న బెంగళూరు విమానాశ్రయంలో దిగిన రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు. మైసూర్ సమీపంలోని రేవణ్ణ ఫాంహౌజ్ లో వంటపనిచేస్తున్న 47ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవణ్ణపై పలు కేసులు నమోదు అయ్యాయి. తనపై ఆరోపణలు చేయకుండా ఆపేందుకు రేవణ్ణ కుటుంబ సభ్యులు తనకు కిడ్నాప్ చేశారని ఆ మహిళ ఆరోపించింది.
ALSO READ : 10వ అంతస్తు నుంచి దూకి హాస్టల్ విద్యార్థి ఆత్మహత్య: బాంబే ఐఐటీలో విషాదం..
ఈ కేసులో 40 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం 1800 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం..38సార్లు విచారించింది కోర్టు. 26 మంది సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసి 180 పత్రాలను పరిశీలించింది. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన రేవణ్ణ మరో మూడు కేసులలో ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నారు.