
రోజురోజుకు మనుషుల్లో మానవత్వం మంటకలిసిపోతుంది. డబ్బు కోసం ఎంతటి ఘోరం చేయడానికైనా వెనకాడటం లేదు. చివరికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం గుండెలపై ఎత్తుకుని పెంచిన కన్న తండ్రిని కడతేర్చేందుకు ప్లాన్ చేశాడు ఓ కొడుకు. చివరకు ప్లాన్ రివర్స్ కావడంతో కటకటాల పాలయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గ్రామానికి చెందిన విప్పర్తి హర్షవర్ధన్ సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. కష్టపడకుండా డబ్బు వచ్చే మార్గమేంటని.. ఇందుకోసం ఏం చేయాలో తీవ్రంగా ఆలోచించాడు. ఈ క్రమంలో హర్షవర్ధన్ మెదడులో ఒక పాడు బుద్ధి వచ్చింది. తండ్రిని చంపి ఇన్సూరెన్స్ డబ్బులు నొక్కేయాలని చూశాడు. రోడ్డు ప్రమాదంలో తండ్రిని లేపేస్తే అతడి పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఎల్ఐసీ డబ్బులు కొట్టేయొచ్చని పథకం వేశాడు.
ప్లాన్‌లో భాగంగా 2025 ఏప్రిల్‌లో ఓ పని మీద బైక్‌పై వెళ్తున్న తండ్రిని కామనగరువు బైపాస్‌లో కారుతో ఢీకొట్టాడు హర్షవర్ధన్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన హర్షవర్ధన్ తండ్రి కోమాలోకి వెళ్లాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కోమా నుంచి బయటకు వచ్చాడు. కోమా నుంచి బయటకు వచ్చి తర్వాత అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్లో కొడుకుపై ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హర్షవర్ధన్ పై కేసు నమోదు చేశారు.
పోలీసులు విచారణలో ఈ అమానవీయ విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొడుకే తనను కడతేర్చేందుకు ప్రయత్నించాడని తెలియడంతో ఆ తండ్రి గుండె బాధతో బద్దలైంది. పోలీసులు హర్షవర్ధన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కొడుకు హర్షవర్ధన్ చేసిన పనికి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఛీ కొడుతున్నారు. డబ్బుల కోసం కన్నతండ్రని కడతేర్చాలని చూస్తాడా అని మండిపడుతున్నారు.