
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఓటమి ఖాయమన్న దశ నుంచి ఇప్పుడు ఫేవరేట్స్ గా మారింది. రెండో రోజు బౌలింగ్ లో అదరగొట్టిన మన జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. మూడో రోజు లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. గ్రీజ్ లో ఓపెనర్ జైశ్వాల్ (85), కెప్టెన్ గిల్ (11) ఉన్నారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో ఇండియా ఆధిక్యం 166 పరుగులకు చేరింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్, టంగ్, ఓవర్దన్ లకు తలో వికెట్ దక్కింది.
అదరగొట్టిన ఆకాష్, జైశ్వాల్:
రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా తొలి సెషన్ లో 114 పరుగులు రాబట్టుకుంది . ఈ సెషన్ లో ఇంగ్లాండ్ కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగింది. ఆరంభం నుంచి నైట్ వాచ్ మెన్ ఆకాష్ దీప్ ఒక ఎండ్ లో వేగంగా ఆడితే.. మరో ఎండ్ లో జైశ్వాల్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో ఆకాష్ తన టెస్ట్ కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చూస్తుండగానే వీరి భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. మూడో వికెట్ కు జైశ్వాల్, ఆకాష్ దీప్ జోడీ 107 పరుగులు జోడించడం విశేషం. లంచ్ కు ముందు ఎట్టకేలకు ఇంగ్లాండ్ ఆకాష్ దీప్ వికెట్ తీసి ఊరట పొందింది.
ఓవర్దన్ బౌలింగ్ లో షార్ట్ కవర్స్ లో క్యాచ్ ఇచ్చి 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. తర్వాత వచ్చిన గిల్, జైశ్వాల్ లంచ్ కు ముందు మరొక వికెట్ పడకుండా సెషన్ ను ముగించారు. రెండో సెషన్ లో టీమిండియా పట్టు బిగిస్తే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్ పై పట్టు బిగించే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ కు కూడా రెండో సెషన్ చాలా కీలకంగా మారింది. ప్రధాన ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ లేకపోవడంతో ఇంగ్లాండ్ కు పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 224 పరుగులకు ఆలౌట్ అయితే.. ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది.
Jaiswal & Akash Deep put India ahead with plenty of batting in the tank https://t.co/rrZF1qeH0S | #ENGvIND pic.twitter.com/QCZu2OYIiX
— ESPNcricinfo (@ESPNcricinfo) August 2, 2025