ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి, నారాయణగిరి జడ్పీ హైస్కూళ్లను కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆకస్మిక తనిఖీ చేశారు. మల్లక్‌పల్లిలో డిజిటల్ క్లాస్‌ను, పరిశుభ్రతతోపాటు రికార్డులను పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన వివిధ అంశాలపై హెచ్ఎం నాగేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా, విద్యా ప్రమాణాలు తక్కువగా ఉండడం పై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సదరు హెచ్ఎంకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని డీఈవో గిరిరాజ్ గౌడ్ ను ఆదేశించారు. నారాయణగిరి స్కూల్లో టెన్త్గర్ల్స్, బాయ్స్ సెక్షన్లను సందర్శించారు.
విద్యార్థులతో పాఠాలను చదివించారు. అనంతరం స్కూల్ సిబ్బందితో విద్యార్థుల ప్రగతి సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఉపాధ్యాయుల డైరీ, వంటలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులను చదువులో మరింత మెరుగుపర్చాలన్నారు. పదోతరగతి చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో డాక్టర్ బి.రాంధన్, తహసీల్దార్ గుత్తికొండ సదానందం, ఎంపీడీవో కమటం అనిల్ కుమార్, మల్లకపల్లి, నారాయణగిరి గ్రామాల సర్పంచులు గిన్నారపు లత, పుట్ట రేణుక తదితరులు పాల్గొన్నారు.
