భద్రాద్రి కొత్తగూడెం : 15 ఎకరాల అటవీ భూమి కబ్జా

భద్రాద్రి కొత్తగూడెం : 15 ఎకరాల అటవీ భూమి కబ్జా

భద్రాద్రి కొత్తగూడం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో తమ విధులను అడ్డుకున్నారంటూ..కొత్తగూడం MLA వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే కుమారుడు రాఘవపై ఫారెస్ట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వనమా కుమారుడు రాఘవ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. కోట్ల విలువైన 15 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించిన వ్యక్తికి మద్దతిస్తూ… అటవీ అధికారులు ఆ భూమివైపు వెళ్లొద్దంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ విధులను అడ్డుకుంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అతని కుమారుడు రాఘవపై చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఫిర్యాదులో కోరారు. ఆసిఫాబాద్ ఘటనకు ముందే కొత్తగూడెం ఎమ్మెల్యేపై అటవీ అధికారులు ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఆలస్యంగా వెలుగుచూసింది.

కొత్తగూడెం జిల్లా కేంద్రానికి దగ్గరలోని లక్ష్మీదేవిపల్లి లోతువాగు సమీపంలో.. వనమా అనుచరుడైన పూనెం శ్రీను అనే వ్యక్తి 15 ఎకరాల అటవీ భూమి కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేశాడు. భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీ అధికారులపై అధికారపార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అతని కుమారుడు రాఘవ బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అటవీశాఖ అధికారులు. వనమా ఫారెస్ట్ అధికారులతో రివ్యూ చేసిన సమయంలోనూ కబ్జాకు పాల్పడిన వ్యక్తి ఆయన పక్కనే ఉన్నారు.

హైవే పక్కన వున్న ఫారెస్ట్ భూమిని సంరక్షిస్తున్న అధికారులను.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తమపై దాడికి పురిగొలిపినట్లు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమి దగ్గరకు అటవీ అధికారులు వస్తే దాడి చేయండంటూ తమ అనుచరులను పురిగొల్పుతున్నారని ఫిర్యాదు చేశారు అటవీ అధికారులు. ఫారెస్ట్ అధికారి ఫిర్యాదు చేసినా.. అధికార పార్టీ ఎమ్మెల్యే భయంతో.. పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. ప్రేక్షకపాత్ర పోషిస్తున్న పోలీసుల తీరుపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అధికారులకు అండగా ఉండాల్సిన అధికారపార్టీ నేతలే దాడులు చేయటం, వారి విధులను అడ్డుకోవటంపై ఫారెస్ట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.