
హైదరాబాద్, వెలుగు : ఈ సారి అసెంబ్లీకి డాక్టర్లు క్యూ కట్టనున్నారు. 119 నియోజకర్గాలు ఉండగా, 15 నియోజకవర్గాల్లో డాక్టర్లు గెలుపొందారు. ఇందులో కొంత మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండగా, కొంత మంది స్పెషలిస్టులు ఉన్నారు. వీరిలో పది మంది తొలిసారి చట్టసభల్లో అడుగు పెట్టబోతుండగా, ఐదుగురికి ఇదివరకే ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంది. మాజీ ఎంపీ, డాక్టర్ వివేక్ వెంకటస్వామి(ఎంబీబీఎస్) చెన్నూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను చిత్తుగా ఓడించారు. మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ వంశీకృష్ణ(జనరల్ సర్జన్) అచ్చంపేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై గెలిచారు.
మాజీ ఎమ్మెల్సీ, డాక్టర్ భూపతిరెడ్డి(ఆర్థోపెడాలజిస్ట్) నిజామాబాద్ రూరల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను ఓడించారు. కోరుట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్(న్యూరాలజిస్ట్) బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ను ఓడించారు. జగిత్యాల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్‌కుమార్(ఆప్తల్మాలజిస్ట్) కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై గెలిచారు.
పది మంది తొలిసారి అసెంబ్లీకి
డోర్నకల్ నుంచి జనరల్ సర్జన్ రామచంద్రనాయక్(కాంగ్రెస్), సిర్పూర్ నుంచి ఆర్థోపెడాలజిస్ట్ పాల్వాయి హరీశ్‌బాబు(బీజేపీ), మహబూబాబాద్ నుంచి జనరల్ సర్జన్ మురళీ నాయక్(కాంగ్రెస్), మానకొండూరు నుంచి జనరల్ సర్జన్ కవ్వంపల్లి సత్యనారాయణ(కాంగ్రెస్), మెదక్ నుంచి ఎంబీబీఎస్ డాక్టర్ మైనంపల్లి రోహిత్(కాంగ్రెస్), నారాయణపేట్ నుంచి జనరల్ ఫిజీషియన్ పర్ణికా రెడ్డి(కాంగ్రెస్), నారాయణఖేడ్ నుంచి పీడియాట్రిషన్ సంజీవరెడ్డి(కాంగ్రెస్), భద్రాచలం నుంచి ఆర్థోపెడిషియన్ తెల్లం వెంకటరావు(బీఆర్‌ఎస్), సత్తుపల్లి నుంచి పల్మనాలజిస్ట్ రాగమయి(కాంగ్రెస్), నాగర్‌కర్నూల్ నుంచి డెంటల్ స్పెషలిస్ట్ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి(కాంగ్రెస్) గెలుపొందారు.