కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.5 లక్షల కోట్లు రావాలె

కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.5 లక్షల కోట్లు రావాలె
  • కాళేశ్వరం ప్రాజెక్టు జల్ది కట్టకుంటే ఇంకో రూ.లక్ష కోట్లు అయితుండె: మంత్రి హరీశ్‌‌ రావు

హైదరాబాద్, వెలుగు: అప్పులు పద్ధతి ప్రకారం బాధ్యతతోనే చేస్తున్నామని ఆర్థిక మంత్రి హరీశ్ అన్నారు. తెలంగాణ సంపదను పేద ప్రజలకు పంచామని.. కేంద్రం మాదిరి మిత్రులకు కాదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో తొందరగా పూర్తి చేశామని, లేదంటే ఇంకో రూ.లక్ష కోట్లు అవసరం అయ్యేవని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని.. తెలంగాణనే కేంద్రానికి నిధులిస్తున్నదని అన్నారు. ఎఫ్ఆర్‌‌బీఎం చ‌‌ట్టం అమ‌‌లులో కేంద్రం ద్వంద్వ వైఖ‌‌రి, రాష్ట్ర ప్రగ‌‌తిపై దాని ప్రభావం అనే అంశాలపై షార్ట్ డిస్కషన్ సంద‌‌ర్భంగా అసెంబ్లీలో హ‌‌రీశ్ రావు మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.96 లక్షల కోట్ల నిధులు వస్తే.. రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3 లక్షల కోట్లకుపైగా కట్టిందన్నారు. వివిధ రూపాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.5 లక్షల కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. నీతి ఆయోగ్‌‌ చెప్పినా, 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదన్నారు. పన్నుల వాటాను రాష్ట్రానికి 42 శాతానికి పెంచామని కేంద్రం చెబుతోందని, వాస్తవానికి రాష్ట్రానికి వస్తున్నది 29.6 శాతమేనని తెలిపారు. దీంతో తెలంగాణకు రూ.33,712 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. బీజేపీ మౌలిక సిద్ధాంతమే బలమైన కేంద్రం– బలహీనమైన రాష్ట్రాలుగా ఉందని మండిపడ్డారు.

రాష్ట్ర అప్పు రూ.3.29 లక్షల కోట్లు

‘‘కేంద్రం అప్పు కోటీ 52 లక్షల 17 వేల కోట్లుగా ఉంది. ఈ లెక్కన ప్రతి పౌరుడిపై రూ.లక్షా 25 వేల అప్పు ఉన్నట్లు. ఎఫ్ఆర్‌‌‌‌బీఎం పరిధిలో తెలంగాణ అప్పు రూ.3.29 లక్షల కోట్లుగా ఉంది” అని హరీశ్‌‌రావు చెప్పారు. శాస‌‌నస‌‌భ‌‌లో బ‌‌డ్జెట్ ఆమోదం పొందిన త‌‌ర్వాత రెట్రాస్పెక్టివ్‌‌గా బ‌‌డ్జెట్‌‌లో కోత పెడుతామంటే.. అప్పటికే ప్లాన్ చేసుకున్న బ‌‌డ్జెట్ ఎలా అమ‌‌లు చేయ‌‌గ‌‌లుగుతామని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం 8 ఏండ్ల పాలన సఫలం, సంక్షేమం, సామరస్యంగా ఉందని.. కేంద్రం రాష్ట్రాల పట్ల విఫలం, విషం, విద్వేషంగా పనిచేస్తోందని ఆరోపించారు. కేంద్రం వల్ల దేశంలో ఎవరు బాగుపడ్డారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు పెండింగ్‌‌లో పెట్టారని చెప్పారు. జీఎస్‌‌టీ వల్ల తెలంగాణకు నష్టమే వస్తోందన్నారు. 15వ ఆర్థిక సంఘం తెలంగాణకు సిఫార్సు చేసిన గ్రాంట్లు ఇవ్వలేదు కానీ.. అదే ఆర్థిక సంఘం ‘అప్పులకు కోతలు పెట్టండి’ అంటే కోతలు పెట్టారంటూ విమర్శించారు.

అన్నింట్లో బీజేపీ ఫెయిల్

బీజేపీ పాలనలో అన్నీ ఫెయిల్ అని హరీశ్ విమర్శించారు. ‘‘విదేశాల నుంచి నల్లధనం తెస్తామన్నారు.. ఫెయిల్. పేదల ఖాతాల్లో 15 లక్షలు.. ఫెయిల్. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు.. ఫెయిల్. పెద్ద నోట్ల రద్దు.. ఫెయిల్. రైతుల ఆదాయం రెట్టింపు.. ఫెయిల్. ఎంఎస్ఎంఈలకు గంట లోపల రుణాలు.. ఫెయిల్’’ అంటూ ధ్వజమెత్తారు.