15 లక్షలు పెట్టినా ప్రాణం దక్కలే

15 లక్షలు పెట్టినా ప్రాణం దక్కలే

కరోనాతో నారాయణపేట డిప్యూటీ తహసీల్దార్ మృతి

రోజుకు 5 లక్షల బిల్లేసిన ఆస్పత్రి

మొత్తం డబ్బు కడితేనే డెడ్ బాడీ ఇస్తామన్న హాస్పిటల్

నారాయణపేట టౌన్, వెలుగు: ఆయన నారాయణపేట కలెక్టరేట్ లో డిప్యూటీ తహసీల్దార్ . కరోనా పాజిటివ్​ రావడం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో బుధవారం హైదరబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. రోజూ రూ.5 లక్షలు చొప్పున మూడురోజులకు హాస్పిటల్ రూ.15 లక్షల బిల్లు వేసింది. అయినా ఆయన ప్రాణాలు దక్కలేదు. ఇప్పుడు మొత్తం డబ్బు కట్టేదాకా డెడ్ బాడీని అప్పగించే ప్రసక్తే లేదని హాస్పిటల్ స్టాఫ్ తేల్చి చెప్పడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

నారాయణపేటజిల్లా కలెక్టరేట్ లో డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహిం చే శ్రీనివాస్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఓ పని మీద ఏపీకి వెళ్లారు. ఆ తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. వారం క్రితం పాజిటివ్​ అని తెలిసి హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇంటి ఓనరుకు విషయం తెలిసి, వెళ్లిపొమ్మని చెప్పడంతో మహబూబ్ నగర్ లోని కొడుకు ఇంట్లో హోంక్ వారంటైన్ లో ఉన్నా రు. రెండురోజుల క్రితం ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో హైదరాబాద్ కు వెళ్లారు. కార్పొ రేట్ ఆసుపత్రుల్లో ఎవరూ చేర్చుకోకపోవడంతో చివరకు కలెక్టర్ రికమండేషన్ తో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈక్రమంలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధ, గురు, శుక్రవారాల్లో హాస్పిటల్ మేనేజ్ మెంట్ ఏకంగా రూ.15 లక్షలు బిల్ వేయగా, తాము రూ.5 లక్షలు కట్టినట్లు చెబుతున్నారు. మిగతా డబ్బులు కడితేనే డెడ్ బాడీని అప్పగిస్తామని చెప్పడంతో తాము హాస్పిటల్ బయటే ఎదురుచూస్తున్నామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.