150 మీటర్లు.. 125 టీఎంసీలు ..తుమ్మిడిహెట్టి బ్యారేజీ నీటి లభ్యత అంశం కొలిక్కి

150 మీటర్లు.. 125 టీఎంసీలు ..తుమ్మిడిహెట్టి బ్యారేజీ నీటి లభ్యత అంశం కొలిక్కి
  • 150 మీటర్లు.. 125 టీఎంసీలు!
  • తుమ్మిడిహెట్టి బ్యారేజీ నీటి లభ్యత అంశం కొలిక్కి
  • హైడ్రాలజీ ప్రాథమిక సిమ్యులేషన్​ స్టడీస్​ పూర్తి
  • 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే వచ్చేది 55 టీఎంసీలే
  • 149 మీటర్లతో 77 టీఎంసీల నీళ్లు
  • ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్​ దాదాపు రెడీ.. మరో వారంలో పూర్తయ్యే చాన్స్​

హైదరాబాద్, వెలుగు:  ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా అధికారులు కూడా యుద్ధప్రాతిపదికన తుమ్మిడిహెట్టి బ్యారేజీపై  ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే బ్యారేజీ సైట్​ వద్ద సర్వేలూ పూర్తికాగా.. బ్యారేజీ అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్​పైనా ఓ నిర్ధారణకు వచ్చేశారు. ఇటు కెనాల్​అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్​పైనా చర్చలు నడుస్తున్నాయి. హైడ్రాలజీ స్టడీస్​ కూడా రెండోదశకు చేరుకున్నాయి. ఇంటర్​స్టేట్​ ఇష్యూస్​ అంశాలూ కొలిక్కి వస్తున్నాయి. ప్రాజెక్ట్ ​నిర్మాణంలో అత్యంత కీలకమైనది హైడ్రాలజీ స్టడీలే. నీటి లభ్యత లేదనే కారణంతో గత బీఆర్ఎస్​ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని  పక్కనపెట్టింది. నీటి లభ్యత ఉందని సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) చెప్పినా.. ఆ రిపోర్టునూ మసిపూసి మారేడుకాయ చేసి తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వం మభ్యపెట్టింది.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​ సర్కార్​ నీటి లభ్యతపై సీరియస్‌‌‌‌‌‌‌‌గా దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ హైడ్రాలజీ వింగ్​.. దానిపై విస్తృతమైన స్టడీలు చేస్తున్నది. తాజాగా, దానికి సంబంధించి నీటి లభ్యత, ఫ్లడ్​ తీరుతెన్నులపై ప్రాథమికంగా సిమ్యులేషన్​ స్టడీస్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసినట్టు తెలిసింది. బ్యారేజీని ఎంత ఎత్తులో నిర్మిస్తే.. ఎంత మేర నీటి లభ్యత ఉంటుందన్న దానిపై విశ్లేషించినట్టు సమాచారం. 150 మీటర్లు, 149 మీటర్లు, 148 మీటర్ల ఎత్తుల్లో వరద ప్రవాహం, నీటి లభ్యతలాంటి విషయాలను సిమ్యులేషన్​ ద్వారా అంచనా వేసినట్టు తెలిసింది. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మిస్తే.. ప్రభుత్వం తరలించాలనుకుంటున్న దానికన్నా ఎక్కువ నీటిని తరలించుకునే అవకాశం ఉంటుందని ప్రాథమిక స్టడీస్‌‌‌‌‌‌‌‌లో తేలినట్టు సమాచారం. దాదాపు 125 టీఎంసీల దాకా జలాలను తరలించుకునే అవకాశం ఉంటుందని సిమ్యులేషన్​ స్టడీస్‌‌‌‌‌‌‌‌లో తేలినట్టు సమాచారం.


149 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే.. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా 78 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉంటుందని తేలినట్టు సమాచారం. ఇక, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న ఎత్తుతో అంటే.. 148 మీటర్లతోనే బ్యారేజీని నిర్మిస్తే మాత్రం నీటి లభ్యత చాలా వరకు తగ్గిపోతున్నట్టు తేలింది. ఆ ఎత్తుతో అక్కడ బ్యారేజీని నిర్మిస్తే కేవలం 55 టీఎంసీలకు అటూఇటుగానే నీటి లభ్యత ఉంటున్నట్టు సిమ్యులేషన్​ స్టడీస్‌‌‌‌లో తేలినట్టు తెలుస్తున్నది. దీనిపై గ్రౌండ్‌‌‌‌లో మరోసారి అధికారులు విస్తృతంగా స్టడీ చేయనున్నారు. ఆ స్టడీ రిపోర్ట్​ ఆధారంగా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్​ (పీఎఫ్‌‌‌‌ఆర్​)లో హైడ్రాలజీ చాప్టర్​ అంశాన్ని చేర్చనున్నారు.

పీఎఫ్‌‌‌‌ఆర్​ దాదాపు రెడీ..

ప్రాజెక్ట్​ నిర్మాణానికి పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్​) ​ అత్యంత కీలకం. పీఎఫ్ఆర్​లోనే ప్రాజెక్ట్​ స్వరూపం, కెనాల్​ అలైన్‌‌‌‌మెంట్​, ఆయకట్టు, నీటి లభ్యత, అంతర్రాష్ట్ర అంశాలు సహా అన్ని అంశాలనూ క్షుణ్నంగా పేర్కొంటారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌‌‌‌కు సంబంధించి ఆయా 8 చాప్టర్లతో పీఎఫ్‌‌‌‌ఆర్​ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రాజెక్ట్​ స్వరూపం, ఆయకట్టు, ఇంటర్​స్టేట్​ ఇష్యూస్, ముంపు, భూసేకరణసహా 6 అంశాలకు పీఎఫ్‌‌‌‌ఆర్​లో తుదిరూపు వచ్చినట్టు తెలిసింది. హైడ్రాలజీ, కెనాల్​అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌లకు సంబంధించిన అంశాలే పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. హైడ్రాలజీ చాప్టర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కూడా దాదాపు వర్క్​ పూర్తి కావస్తున్నది. అలైన్‌‌‌‌మెంట్​ విషయంలోనే కొంత ఆలస్యం జరుగుతున్నట్టు తెలిసింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ సైట్​ నుంచి ఇప్పటికే 71.5 కిలోమీటర్ల కాలువ సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి సుందిళ్లకు 22 కిలోమీటర్ల టన్నెల్, అక్కడి నుంచి 5 కిలోమీటర్ల ఓపెన్​ కెనాల్‌‌‌‌తో నీటిని తీసుకెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దానికి సంబంధించి తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెబుతున్నారు. ఇటు బ్యారేజీ అలైన్‌‌‌‌మెంట్​ విషయంలోనూ డ్రాయింగ్స్​, డిజైన్స్​ విషయంలో కొంత ఆలస్యమవుతున్నది. ఆర్వీ అసోసియేట్స్​ అన్ని సర్వేలు పూర్తి చేసినా.. బ్యారేజీ సైట్​ వద్ద నేల పరిస్థితులు తెలుసుకునేందుకు జియోటెక్నికల్​, జియోఫిజికల్​ టెస్టులు చేయాల్సి ఉంది. ఆ టెస్టులు చేస్తేగానీ.. బ్యారేజీ అలైన్‌‌‌‌మెంట్, డిజైన్స్​పై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. అయితే, సంస్థకు సర్వే చేసిన బిల్లులు పెండింగ్‌‌‌‌లో ఉండడంతో.. అవి చెల్లిస్తేగానీ జియోటెక్నికల్​, జియోఫిజికల్​ టెస్టులు చేసేందుకు లేదంటున్నారు. ఈ క్రమంలోనే దీనిపై రెండు మూడురోజుల్లో అధికారులతో ఉన్నతాధికారులు రివ్యూ నిర్వహించే అవకాశాలున్నాయని తెలిసింది. అవన్నీ పూర్తయితే.. ఒక వారంలో పీఎఫ్ఆర్​ రెడీ అయిపోతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. జూన్​ తొలి వారంలో పీఎఫ్​ఆర్​ పూర్తయ్యే అవకాశాలున్నాయని సమాచారం. 

అభ్యంతరాలు తెలిపినోళ్లతో నేడు సమావేశం..

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌‌‌‌‌‌‌‌పై కొందరు రిటైర్డ్​ ఇంజినీర్లు ఇప్పటికే అభ్యంతరం తెలిపారు. తాజాగా మరో రిటైర్డ్​ డీఈఈ నేతృత్వంలో పనిచేస్తున్న లక్ష్మీ ఇంజినీర్స్​ అనే సంస్థ కూడా బ్యారేజీపై అభ్యంతరాలు తెలిపినట్టు తెలిసింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్​ ఫీజిబుల్​ కాదని ఆ సంస్థ ఇరిగేషన్​ అధికారులకు ఓ లేఖ రాసింది. ఆదిలాబాద్​ జిల్లాలోని తేజాపూర్​ వద్ద వార్ధా నదిపై బ్యారేజ్​ నిర్మించాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అక్కడ 235 టీఎంసీల నీటి లభ్యత ఉందని, అక్కడ బ్యారేజీ నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. అయితే, అభ్యంతరాలు తెలిపిన వారితో శనివారం ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించనున్నారు. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వారి అనుమానాలను నివృత్తి చేయనున్నారు.