ట్రిపుల్ ఆర్పై 1500 అభ్యంతరాలు ..అలైన్మెంట్ మార్చాలంటున్న రైతులు

ట్రిపుల్ ఆర్పై 1500 అభ్యంతరాలు ..అలైన్మెంట్ మార్చాలంటున్న  రైతులు
  •  కాదంటే న్యాయమైన పరిహారానికి డిమాండ్​ 
  • ప్రైమరీ నోటిఫికేషన్​పై వ్యతిరేకత
  • అభ్యంతరాలపై ప్రభుత్వానికి హెచ్ఎండీఏ రిపోర్ట్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ట్రిపుల్ ఆర్ మార్గంపై హెచ్ఎండీఏ విడుదల చేసిన ప్రైమరీ నోటిఫికేషన్​కు ఆయా ప్రాంతాల్లోని రైతుల నుంచి భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ట్రిపుల్​ఆర్​ను 354 కి.మీ. పరిధిలో 100 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు. ఓఆర్​ఆర్​కు వెలుపల ఉన్న 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల్లో భూములు ప్రభావితం కానున్నాయి. అయితే, ఈ అలైన్​మెంట్​వల్ల తమకు జీవనాధారమైన భూములు పొతున్నాయని, ఇచ్చేది లేదని, అలైన్​మెంట్​మార్చాలని  రైతులు డిమాండ్​చేస్తున్నారు. న్యాయమైన పరిహారం అయినా ఇవ్వాలని కోరుతున్నారు. 

సూచనల కంటే అభ్యంతరాలే ఎక్కువ 

ట్రిపుల్​ఆర్​(దక్షిణ) అలైన్​మెంట్​వివరాలను ఈనెల మొదటి వారంలోనే హెచ్ఎండీఏ తన వెబ్ సైట్ లో ఉంచి సెప్టెంబరు 15 వరకు అభ్యంతరాలు, సూచనలు చేయాలని కోరింది. అలైన్​మెంట్​ను వ్యతిరేకిస్తూ నల్లగొండ, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్​నగర్​జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు అధికారులకు ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు. అలాగే, గడువు లోపు సూచనల కంటే అభ్యంతరాలే ఎక్కువగా వ్యక్తం చేశారు. మొత్తం 1500 మంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మర్రిగూడెం, తలకొండ, కొండాపూర్​తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆబ్జక్షన్స్​వ్యక్తమైనట్టు సమాచారం. 

రిపోర్ట్​ రెడీ చేస్తున్న అధికారులు

ట్రిపుల్​ఆర్​పై వచ్చిన అభ్యంతరాలపై నివేదిక సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టు భవితవ్యం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందంటున్నారు.

రేడియల్​ రోడ్డుకు భూములు తీసుకోవద్దు

పరిగి, వెలుగు: రేడియల్​ రింగ్​ రోడ్డు అలైన్​మెంట్​ మార్చాలని కోరుతూ పరిగి నియెజకవర్గ రైతులు మంగళవారం తహసీల్దార్ వెంకటేశ్వరీకి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు బ్యానర్​ పట్టుకుని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్​ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. రేడియల్​ రింగ్​ రోడ్డు కోసం 8 గ్రామాలకు చెందిన 200 కుంటుంబాల రైతులు సుమారుగా 360 ఎకరాల భూమిని కోల్పోతున్నారని వారన్నారు. తమ భూములు ఇవ్వబోమని, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూసుకోవాలని అన్నారు.