ప్రజాభవన్​లోని ప్రజావాణికి 1,509 ఫిర్యాదులు

ప్రజాభవన్​లోని ప్రజావాణికి 1,509 ఫిర్యాదులు

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం1,509 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎక్కువ శాతం భూసమస్యలు, ఉద్యోగాలు, రేషన్​కార్డులు, డబుల్​బెడ్​రూమ్ ఇండ్లకు సంబంధించినవే ఉన్నాయి. ప్రజావాణి ఇన్​చార్జ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ ఫిర్యాదుదారులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. జీఓ నంబర్ 46తో నష్టపోయిన మెరిట్​స్టూడెంట్లు తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. వెంటనే జీఓను రద్దు చేయాలని కోరారు. డీఎస్సీ 2008 నోటిఫికేషన్ తో కామన్​మెరిట్​లో సెలక్ట్ అయి నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని పలువురు అభ్యర్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 15, 20, 30 మార్కులు వచ్చిన వారు ఉద్యోగాలు చేస్తున్నారని, 72, 70, 65 మార్కులు వచ్చినా, ఉద్యోగాలు రాలేదని వాపోయారు. 

వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం ఎస్సై నగేశ్​భూకబ్జాదారుడు చింతకంది కుమారస్వామితో కుమ్మక్కై తమను బెదిరిస్తున్నట్టు సాదం వాసవి, జయశ్రీ శ్రావణ్​తండ్రి కుమార్​స్వామి  ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.  మేడ్చల్​జిల్లా శామీర్​పేట మండలం బొమ్మరాసిపేటలో అచ్చుత్​ఇనిస్టిట్యూట్, లియోనియా రిసార్ట్స్​లో పనిచేస్తున్న దళిత మహిళా కార్మికులను కులంపేరుతో దూషిస్తూ దాడులకు పాల్పడుతున్న న్యాయవాది దామోదర్​రెడ్డి, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాలమల్లేశ్​అనే వ్యక్తి ఆధ్వర్యంలో పలువులు మహిళలు ఫిర్యాదు చేశారు.  కరీంనగర్​కు చెందిన 40 మంది మహిళలు డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఇవ్వాలని కోరుతూ అర్జీ అందజేశారు. 

ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలి

మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన పఠాన్​జమీల్​ఖాన్ 2006 నుంచి 2019 వరకు అమెరికా, మలేషియా, శ్రీలంక దేశాల్లో జరిగిన కరాటే, కుంగ్ ఫు, తైక్వాండో పోటీల్లో పాల్గొని మెడల్స్​సాధించాడు. ఇంటర్​నేషనల్ స్థాయిలో 35 గోల్డ్​మెడల్స్, రెండు సార్లు  వరల్డ్​గిన్నీస్ రికార్డులు సాధించాడు. మొత్తంగా 115 మెడల్స్ పఠాన్​జమీల్​ఖాన్​ప్రస్తుతం సిటీలోని మెహిదీపట్నంలో ఉంటున్నాడు. స్పోర్ట్స్​కోటాలో గ్రూప్​–1 ఉద్యోగంతోపాటు ఇంటి స్థలం ఇవ్వాలని అర్జీ అందజేశాడు.