టెలిగ్రామ్‌‌లో క్రిప్టో ట్రేడింగ్‌‌ పేరిట 1.58 లక్షలు మాయం

టెలిగ్రామ్‌‌లో క్రిప్టో ట్రేడింగ్‌‌ పేరిట 1.58 లక్షలు మాయం
  • సైబర్‌‌ నేరస్థుడిని అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు  

హైదరాబాద్‌‌,వెలుగు: టెలిగ్రామ్ యాప్ ద్వారా క్రిప్టో ట్రేడింగ్‌‌ పేరిట మోసాలకు పాల్పడుతున్న సైబర్‌‌ నేరగాన్ని కరీంనగర్‌‌ సీసీపీఎస్‌‌ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ జోధ్‌‌పూర్‌‌‌‌కు చెందిన అరుణ్‌‌చౌదరి.. టెలిగ్రామ్‌‌లో ‘ఏజెంట్‌‌ రిచర్డ్‌‌ ఓఎఫ్‌‌టీ’  పేరిట అకౌంట్ క్రియేట్ చేశాడు.  అందులో క్రిప్టో ట్రేడింగ్‌‌ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్రేడింగ్‌‌లో భారీ లాభాలు వస్తున్నాయని కరీంనగర్‌‌కు చెందిన కృష్ణ గౌడ్‌‌ను ప్రలోభపెట్టాడు. 

అరుణ్‌‌ మాటలను నమ్మిన కృష్ణగౌడ్‌‌..అతనికి యూపీఐ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్‌‌ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పలు దఫాల్లో రూ.1.58లక్షలు పంపాడు. ఆ తర్వాత అరుణ్‌‌ టెలిగ్రామ్‌‌ అకౌంట్ డెలిట్‌‌ అవ్వడంతో కృష్ణ గౌడ్‌‌ తాను మోసపోయినట్టు గుర్తించాడు. వెంటనే కరీంనగర్‌‌ సీసీపీఎస్‌‌ (సైబర్‌‌ క్రైం పోలీస్‌‌ స్టేషన్‌‌)లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 

నిందితుడు అరుణ్‌‌ రాజస్థాన్‌‌లోని జోద్‌‌పూర్‌‌లో ఉన్నట్టు గుర్తించారు. శుక్రవారం అక్కడికి వెళ్లి అరుణ్‌‌ని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్‌‌ వారెంట్‌‌పై కరీంనగర్‌‌కు తరలించారు. శనివారం రిమాండ్ చేశారు. నిందితుడిపై తమిళనాడులోనూ రెండు కేసులు నమోదైనట్టు కరీంనగర్‌‌ పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన కరీంనగర్‌‌ సీసీపీఎస్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ సునీల్‌‌, డీఎస్పీ నర్సింహారెడ్డిని సీఎస్‌‌బీ డైరెక్టర్‌‌ శిఖాగోయల్‌‌ అభినందించారు.