డాక్టర్ కావాలన్న కోరికే చిదిమేసింది.. విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం

డాక్టర్ కావాలన్న కోరికే చిదిమేసింది.. విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం

రాజస్థాన్‌లోని కోటాలో దారుణం చోటుచేసుకుంది. నీట్ కోచింగ్ తీసుకుంటున్న 16 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 10న జరగ్గా..  ఫిబ్రవరి 15న నలుగురు విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు చెందిన వారని పోలీసులు తెలిపారు. అందరూ 18 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులేనని ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.

ఏం జరిగిందంటే..?

16 ఏళ్ల విద్యార్థిని కోటాలోని ఓ కోచింగ్ సెంటర్ లో నీట్ ప్రిపరేషన్ కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భాధితురాలకి అదే కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్న మరో నీట్‌ విద్యార్థి సోషల్‌ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఘటన జరిగిన రోజు నిందితుడు చదువు సాకుతో విద్యార్థినిని తన అపార్ట్‌మెంట్‌కు పిలవగా.. బాలిక అక్కడికి వెళ్ళింది. అప్పటికే అక్కడ తిష్టవేసిన మరో ముగ్గురు విద్యార్థులు అతనికి సహకరించారు. నలుగురు ఒక్కసారిగా మీద పడడంతో సదరు విద్యార్థిని తనను తాను కాపాడుకోలేకపోయింది.

ఈ ఘటన ఫిబ్రవరి 10 (శనివారం)న జరగ్గా.. విద్యార్థిని డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని కోటా మహిళా వేధింపుల విభాగం ఏఎస్పీ ఉమా శర్మ తెలిపారు. కౌన్సెలింగ్ సెషన్‌లో బాలిక తనపై జరిగిన ఘోరాన్ని బయటపెట్టినట్లు ఆమె వెల్లడించారు. నలుగురు నిందితులు అదే కోచింగ్ హబ్‌లో ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నారని ఎఎస్పీ తెలిపారు. నిందితులపై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.