- సాద్యాసాధ్యాలను పరిశీలించాలని కేబినెట్ లో నిర్ణయం
భద్రాద్రికొత్తగూడెం. వెలుగు : జిల్లాలోని పాల్వంచలో 1600మెగావాట్ల పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు తొలి అడుగు పడింది. 800మెగా వాట్ల పవర్ ప్లాంట్లురెండు ఏర్పాటు చేసే విషయమై సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు.
పాల్వంచలో గతంలో కూల్చి వేసిన పవర్ ప్లాంటు స్థానంలో కొత్త ప్లాంట్లు నిర్మించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలుమార్లు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావుకు వినతిపత్రం ఇచ్చారు. పాల్వంచలో విద్యుత్ పవర్ ప్లాంట్ల ఏర్పాటును పరిశీలిస్తానని గతంలో డిప్యూటీ సీఎం భట్టి జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.
విద్యుత్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై పరిశీలన చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్వహించడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవర్ ప్లాంట్ల ఏర్పాటు ఎన్టీపీసీకి ఇస్తే విద్యుత్ యూనిట్ ఎంత రేట్ పడుతుంది, జెన్కో అప్పగిస్తే ఎంత రేట్ పడుతుంది అనే విషయాలపై పరిశీలన చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
ముందుగా అంచనాలు వేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యుత్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై మంత్రి వర్గం చర్చించడం పట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.
