పోలవరం ముంపు తప్పాలంటే1,650 కోట్లతో పనులు చేపట్టాలి

పోలవరం ముంపు తప్పాలంటే1,650 కోట్లతో పనులు చేపట్టాలి
  • ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక
  • ఆ ప్రాజెక్టు వల్లే భద్రాచలం పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం సహా పరిసర ప్రాంతాలను రక్షించుకునేందుకు రూ.1,650  కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంటుందని టెక్నికల్‌‌‌‌ కమిటీ తెలిపింది. ఈ ఏడాది జూన్‌‌‌‌లో  గోదావరిలో ముంచెత్తిన వరదలతో భద్రాచలంతో పాటు 90కి పైగా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, గరిష్ట స్థాయిలో నీరు నిలిపితే ఈ ముంపు సమస్య ఎప్పటికీ ఉంటుందని ఆ ప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. దీనిపై స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని ఈఎన్సీ (ఓఅండ్‌‌‌‌ఎం) నాగేందర్‌‌‌‌ రావు నేతృత్వంలో  నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించింది. పోలవరంతో ఈ ఏడాది భద్రాచలం పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని ఆ నివేదికలో పేర్కొంది. 

పోలవరంలో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తే, దుమ్ముగూడెం ఆనికట్‌‌‌‌కు ఎగువన నదిలో కలవాల్సిన 35కి పైగా వాగులు ఎగదన్నుతాయని, దీంతో వాటి పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయని కమిటీ తెలిపింది. తక్కువ వరద వచ్చినా ఈ ఏడాది వరద ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటిని నిల్వచేస్తే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక లెవల్‌‌‌‌లో ఎప్పటికీ నీరు నిలిచి ఉంటుందని వెల్లడించింది. వరదల నుంచి రక్షణ కోసం ఏటపాక నుంచి భద్రాచలం వరకు భారీ ఎత్తున కరకట్టలు నిర్మించాలని, ఇందుకు రూ.1,650 కోట్లు అవసరమవుతాయని సూచించింది. ఈ నిధులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నే సమకూర్చాలని, లేకపోతే  పీపీఏనే కరకట్టల నిర్మాణానికి పూనుకోవాలని కమిటీ పేర్కొంది.