అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోరం

అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోరం

కుటుంబంలో మరణించిన ఒకరి అంత్యక్రియలు చేసేందుకు వెళ్తుండగా.. బంధువులను మృత్యువు వెంటాడింది. డెడ్‌బాడీని స్మశానానికి తీసుకెళ్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో 18 మంది మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగింది.

నదియా జిల్లాలోని బగ్దాకు చెందిన ఓ వ్యక్తి మరణించడంతో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు అంత్యక్రియల వ్యాన్‌ను బుక్ చేశారు. ఆ వ్యాన్‌లో శనివారం రాత్రి నవద్వీప్‌ స్మశాన వాటికకు తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అంత్యక్రియలకు వెళ్తున్న కుటుంబసభ్యులు, బంధువుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న హన్స్‌కాళీ పోలీసులు అక్కడి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టానికి పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దట్టంగా ఉన్న పొగమంచు, లారీ అతి వేగంగా రావడమే యాక్సిడెంట్ జరగడానికి కారణాలని చెప్పారు.