1.8 లక్షల క్వింటాళ్ల వడ్లు మాయం

1.8 లక్షల క్వింటాళ్ల వడ్లు మాయం
  • ఎఫ్‌‌సీఐ తనిఖీల్లో బయటపడిన బాగోతం
  • రైస్ మిల్లుల నిల్వల్లో తేడాలు  
  • 40 మిల్లుల్లో 4.53 లక్షల బస్తాలు గాయబ్   
  • 2,320 మిల్లుల్లో రూల్స్​ బేఖాతర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో లక్షా 81 వేల క్వింటాళ్ల వడ్లు మాయమయ్యాయి. రైస్‌‌ మిల్లుల్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌సీఐ) నిర్వహించిన తనిఖీల్లో భారీగా వడ్ల నిల్వల్లో తేడాలున్నట్టు స్పష్టమైంది. 3,278 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించగా ఎఫ్‌‌సీఐకి ఇవ్వాల్సిన 1.81 లక్షల క్వింటాళ్ల వడ్ల స్టాక్‌‌ మాయం అయినట్లు బయటపడింది. నెలల తరబడి కస్టమ్‌‌ మిల్లింగ్‌‌ రైస్‌‌ (సీఎంఆర్) డెలివరీ లేట్​ అవుతుండడంతో మిల్లుల్లో నిల్వలపై ఎఫ్‌‌సీఐ ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే తనిఖీలు చేయడంతో రైస్‌‌ మిల్లర్ల బాగోతం బయట పడింది.  

స్పెషల్ టీంలతో తనిఖీలు
సమయానికి బియ్యం అందకపోతుండడంతో రంగంలోకి దిగిన ఎఫ్​సీఐ.. ప్రత్యేక టీమ్‌‌లతో మిల్లుల్లో తనిఖీలు నిర్వహించింది. రాష్ట్రంలోని 7 ఎఫ్‌‌సీఐ కార్యాలయాల పరిధిలోని అధికారులతో సోదాలుచేసింది.  ఈ వెరిఫికేషన్‌‌లో 2020–21 యాసంగి, 2021-–22 వానాకాలం సీజన్లకు సంబంధించి అప్పగించిన వడ్లు, మిల్లుల్లోని నిల్వల్లో తేడాలు ఉన్నట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుటి రబీ వడ్లను సరఫరా చేసిన 900 మిల్లుల్లో, ఈ ఏడాది వానాకాలం సేకరించిన వడ్లను మిల్లింగ్‌‌ కు పంపిన 2,378 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు.  40 రైస్‌‌ మిల్లుల్లోని వడ్ల నిల్వల్లో  4,53,896 బస్తాల వడ్లు షార్టేజ్‌‌ ఉన్నట్లు తేలింది. నిరుడు యాసంగికి సంబంధించి 21 మిల్లుల్లో 1,96,177 బస్తాల వడ్లు,  ఈ ఏడాది ఖరీఫ్​కు సంబంధించి 19 మిల్లుల్లో 2,57,719 బస్తాల వడ్లు  షార్టేజ్‌‌ ఉన్నట్లు తేలింది. 

సర్కార్ చర్యలు తీసుకోవాలి: ఎఫ్‌‌సీఐ  
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు వడ్లు మాయం చేసిన  మిల్లులపై చర్యలు తీసుకోవాలని ఎఫ్‌‌సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఉండాల్సిన దానికన్నా  వడ్లు తక్కువగా ఉన్న మిల్లుల వివరాలు పంపించి, మిల్లర్ల వ్యవహారాన్ని సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌తో పాటు ప్రభుత్వానికి తెలియజేసింది. ఎఫ్‌‌సీఐ 7 డివిజన్‌‌ ఆఫీసుల పరిధిలోని 33 జిల్లాల్లో మిల్లుల వారీగా 3,278 మిల్లుల వివరాలను అందజేసింది. ధాన్యం షార్టేజ్‌‌తో పాటు, మెజారిటీ  మిల్లులు ప్రాపర్‌‌గా స్టాకింగ్‌‌ చేయలేదని, వీటిపై చర్యలు తీసుకోవాలని సివిల్‌‌ సప్లయ్స్‌‌ అధికారులను కోరింది.

నిబంధనలు బేఖాతర్‌‌ 
మిల్లర్లు ఎఫ్‌‌సీఐ నిబంధనల ప్రకారం ధాన్యం నిల్వలు నిర్వహించడం లేదని ఎఫ్‌‌సీఐ తనిఖీల్లో గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,278 రైస్‌‌ మిల్లుల్లో 2,320 మిల్లులు అంటే 71 శాతం మిల్లులు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎఫ్‌‌సీఐ తనిఖీల్లో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ ఉండడంతో  2,320 రైస్‌‌ మిల్లుల్లో అధికారుల తనిఖీలు  ఇంకా పూర్తి కాలేదు.  నిరుడు యాసంగికి సంబంధించి 475 మిల్లుల్లో, ఈ ఏడాది వానాకాలానికి సంబంధించి 1,845 మిల్లలు ధాన్యం నిల్వలను నిబంధనల ప్రకారం నిర్వహించడం లేదని స్పష్టమైంది. దీంతో ధాన్యం నిర్వహణ అంతంగానే ఉన్న 2,320 రైస్‌‌ మిల్లుల్లో తనిఖీలు పూర్తికాలేదని ఎఫ్‌‌సీఐ వర్గాలు వెల్లడించాయి.