వీడియో : గాలి కూడా ఆడని కాంక్రీట్ మిక్సింగ్ ట్యాంక‌ర్ లో వలస కూలీలు

వీడియో : గాలి కూడా ఆడని కాంక్రీట్ మిక్సింగ్ ట్యాంక‌ర్ లో వలస కూలీలు

క‌రోనా లాక్ డౌన్ తో వ‌ల‌స కార్మికులు ప‌డుతున్న క‌ష్టాలు వ‌ర్ణణాతీతం. బ‌స్సులు, రైళ్లు దాదాపు నెల రోజుల పైగా ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోవ‌డంతో తిండీతిప్ప‌లు లేక ఇబ్బందులు పడ్డారు. ప్ర‌భుత్వాలు షెల్ట‌ర్ హోమ్స్ పెట్టిన‌ప్ప‌టికీ.. చాలా మంది ఎలాగైనా సొంతూరికి చేరితే చాల‌న్న త‌ప‌న‌తో కాలిన‌డ‌క‌న ప్ర‌యాణ‌మ‌య్యారు. సొంత ఊరికి చేరితే ఒక‌పూట తిన్నా తిన‌క‌పోయినా.. చావో బ‌తుకో అక్క‌డే అన్న భావ‌న‌తో వంద‌లాది కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్లారు కొంద‌రు. ఇలాంటి వారిలో కొద్ది మంది మ‌రికొంచెం దూరం న‌డిస్తే ఇంటికి చేరుతామ‌న‌గా.. ప్రాణాలు వ‌దిలిన విషాద ఘ‌ట‌న‌లు కూడా జ‌రిగాయి. కొంద‌రు లారీలు, ట్ర‌క్కుల్లో దాక్కుని దాక్కుని వెళ్లారు. ఇప్ప‌టికీ ల‌క్ష‌లాది మంది వ‌ల‌స కార్మికులు వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకుని ఉన్నారు.

ఇలాంటి వారిని త‌ర‌లించేందుకు రెండ్రోజులుగా స్పెష‌ల్ ట్రైన్లు, బ‌స్సుల్లో స్వ‌స్థ‌లాల‌కు త‌ర‌లించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. పాపం ఆ బ‌డుగు జీవుల‌కు ఈ స‌మాచారం కూడా తెలుసో లేదో.. ఇలా కాంక్రీట్ మిక్సింగ్ ట్యాంక‌ర్ ట్ర‌క్ లో సొంతూరికి వెళ్లే సాహసం చేశారు. 18 మంది వ‌ల‌స కూలీలు మ‌హారాష్ట్ర నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ల‌క్నో వెళ్తుండ‌గా.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ ద‌గ్గ‌ర పోలీసులు ఆపారు. ట్యాంక‌ర్ చెక్ చేస్తే లోప‌ల మ‌నుషులు ఉండ‌డం చూసి షాక‌య్యారు. గాలి కూడా స‌రిగా ఆడుతుండో లేదో తెలియ‌ని ఆ ట్ర‌క్ లో 18 మంది ప్ర‌యాణం చేయ‌డ‌మంటే ప్రాణాల‌కు తెగించి వెళ్ల‌డ‌మేన‌ని చెప్పాలి. ట్ర‌క్ ను స్వాధీనం చేసుకుని, ద‌ర్యాప్తు చేప‌డుతున్నామ‌ని చెప్పారు డీఎస్పీ ఉమాకాంత్ చౌద‌రి.