రాజగోపాల్​ అకౌంట్లోనే 18 వేల కోట్లు: కేటీఆర్​

రాజగోపాల్​ అకౌంట్లోనే 18 వేల కోట్లు: కేటీఆర్​
  • బాగా సంపాదించిండు కదా.. ఇంటికి తులం బంగారం ఇస్తడట
  • కర్నాటకలో కల్లుగీత వృత్తిని బ్యాన్ చేసిన్రు
  • ఇక్కడ గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటున్నం
  • కడుపులో పెట్టుకొని చూసుకునేవారు కావాల్నా.. కడుపు మీద తంతున్న వారు కావాల్నా 
  • మన్నెగూడలో గౌడ ఆత్మీయ సమ్మేళనం

ఎల్ బీ నగర్, వెలుగు: ‘‘జన్ ధన్ ఖాతాలో డబ్బులు వేస్తామని నాడు మోడీ అన్నారు. ఆ డబ్బులన్నీ ఒక్కడి అకౌంట్‌‌‌‌లో పడితే సరిపోతుందా. 18 వేల కోట్లు ఒక్కడి అకౌంట్‌‌‌‌లో పడ్డాయి. ఒక్కడికి వేల కోట్ల కాంట్రాక్ట్ ఇస్తే ఆ జిల్లా, ఆ నియోజకవర్గం బాగుపడుతదా?” అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రేపు ఓట్లు వేయించుకునేందుకు ఇంటికి తులం బంగారం ఇస్తాడట, బాగా సంపాదించాడు కదా అని పరోక్షంగా రాజగోపాల్‌‌‌‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగుడలోని బీఏంఆర్ సార్థ ఫంక్షన్ హాల్‌‌‌‌లో టీఆర్ఎస్‌‌‌‌ ఆధ్వర్యంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌‌‌‌తో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో కల్లుగీత కార్మికుల వృత్తిని బ్యాన్ చేస్తూ జీవో ఇచ్చారని, దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అక్కడ కల్లుగీత కార్మికులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారని చెప్పారు.  పది మందిని కడుపులో పెట్టుకొని చూసుకునేవారు కావాల్నా.. వృత్తి మీద, కడుపు మీద తంతున్న వారు కావాల్నా ఆలోచించాలని కేటీఆర్ కోరారు. 

అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నం

తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నదని చెప్పారు. ‘‘2014కు ముందు కులవృత్తులు ధ్వంసం అయ్యాయి. తెలంగా ణ ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా గ్రామీన ప్రాంతాల్లో కుల వృత్తులను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అం దులో భాగంగా గీత కార్మికులను ఆదుకుంటున్నం. 70 వేల మందికి 2016 ఇస్తున్నం. ఇలా ఇస్తున్నది దే శంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తున్నాం” అని చెప్పారు. 

పిల్లను ఇచ్చేటోళ్లు కాదు..

తెలంగాణ రాక ముందు గ్రామాల్లో ఎలా ఉండోదో ఇప్పుడు ఎలా ఉందో ఒక సారి గుర్తు చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. ‘‘ఊర్లలో ఎవరైనా చనిపోతే.. కరెంటోళ్లను బతిమిలాడుకునేది. అంత్యక్రియలకు వచ్చినోళ్లు బాయి దగ్గర స్నానం చేసేందుకు కరెంట్ కొద్దిసేపు ఇవ్వమని అడిగేది. ఇప్పుడు అట్లడిగే పరిస్థితి లేదు. అన్ని సమయాల్లో కరెంట్ ఉంటున్నది” అని చెప్పారు. గతంలో ఫ్లోరోసిస్‌‌‌‌తో కొన్ని ప్రాంతాలకు పిల్లలను కూడా ఇవ్వక పోయేదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని ఇండ్లకు తాగు నీరు ఇస్తున్నామన్నారు. ‘‘రైతులకు రైతు బీమా, రైతు బంధు ఇస్తున్నాం ఒక వైపు పల్లె ప్రగతి, మరో వైపు పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నా. ఆడ పిల్లలకు కల్యాణ లక్ష్మి ఇస్తున్నాం. పిల్లలు పుడితే ఆసుపత్రిలో ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేసినం’’ అని వివరించారు.

కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, కానీ కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదని కేటీఆర్ అన్నారు. కేంద్రంలో బలహీన వర్గాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తాము బీసీలకు కేంద్ర మంత్రి కావాలని డిమాండ్ చేస్తే పెట్టలేదని, కానీ వాళ్లు మాత్రం బీసీ బంధు పెట్టాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం అని కల్యాణ లక్ష్మి కేసీఆర్ తెచ్చారని, తర్వాత అన్ని కులాల వారికి ఇస్తున్నారని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే మన గౌరవం పెరుగుతది: శ్రీనివాస్ గౌడ్

‘‘గతంలో గౌడ్లపై బైండోవర్లు, కేసుల వేధింపులు ఉండేవి. అబ్కారీ అధికారి వచ్చాడంటే వేధింపులు ఉండేవి. ఇప్పుడు అవేవి లేవు. ఎందుకంటే పైన కేసీఅర్ ఉన్నరు” అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో గ్రామాల్లో దందా మనం చేస్తే.. గల్లా పెట్టె వేరే వాళ్ల చేతుల్లో ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మగౌరవంతో బతుకుతున్నామని తెలిపారు. సర్వాయి పాపన్నకు ఏనాడూ గౌరవం 
ఇవ్వలేదని, ఇయ్యాల తెలంగాణలో ఆయనకు సరైన గౌరవం ఇచ్చామన్నారు.

త్వరలో అన్ని వర్గాలకూ ‘బంధు’: గట్టుప్పల్‌‌‌‌ రోడ్‌‌‌‌షోలో కేటీఆర్

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: దళిత బంధులాగే అన్ని వర్గాలకు‌‌‌‌ సాయం చేసే ఆలోచన సీఎం కేసీఆర్ మదిలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. గట్టుప్పల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన రోడ్‌‌‌‌ షోలో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ బీజేపీకి మూడేండ్లుగా రాజగోపాల్‌‌‌‌రెడ్డి కోవర్టుగా ఉన్నారని ఆరోపించారు. అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తమ్ముడికి ఓటు వెయ్యమని అడుగుతున్నాడని, అందుకే కోవర్డు రెడ్డి అన్నానని తెలిపారు. 4 ఏళ్లు నియోజకవర్గంలోని సమస్యలు పట్టించుకోని రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు రాజీనామా చేసి అక్రమంగా వచ్చిన డబ్బులతో ఓట్లు కొని గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నిక కార్పొరేట్ కమలానికి గరిబోళ్ల కారుకు జరుగుతున్నదని అన్నారు. గట్టుప్పల్‌‌‌‌లో కొత్త చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్‌‌‌‌ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే చండూరుని రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తే గ్యాస్ సిలిండర్ ధర 2 వేలు అవుతుందని హెచ్చరించారు.

చేనేతపై జీఎస్టీ ఎత్తేయాలి 

కేటీఆర్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌‌‌‌ ఆదివారం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేశారు. చేనేత ఉత్పత్తులపై విధించిన ఐదు శాతం జీఎస్టీని తొలగించి నేతన్నల జీవితాలకు భరోసా ఇవ్వాలని, దాంతోపాటు దేశ వారసత్వ కళా సంపదనను పరిరక్షించాలని ఆ పిటిషన్‌‌‌‌ లో కోరారు. జీఎస్టీ ఎత్తేయాలని కోరుతూ https://chng.it/sFyKKqQZmd లింక్‌‌‌‌లో రాష్ట్ర ప్రజలందరూ అప్లికేషన్‌‌‌‌లు పోస్ట్‌‌‌‌ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో 50 లక్షల మంది చేనేత కార్మికులు పనిచేస్తున్నారని, వారిలో అత్యధికులు మహిళలేనని తెలిపారు. వారి జీవనోపాధిని దెబ్బతీసేలా జీఎస్టీ విధించడం సరికాదన్నారు. కరోనా సంక్షోభంతో చేనేత రంగం నష్టాల్లో కూరుకుపోయిందని వివరించారు.