రోజుకు 15 వేల క‌రోనా టెస్టులు.. 13 దేశాల‌కు క్లోరోక్విన్

రోజుకు 15 వేల క‌రోనా టెస్టులు.. 13 దేశాల‌కు క్లోరోక్విన్

దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,86,906 క‌రోనా టెస్టులు చేసిన‌ట్లు భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) తెలిపింది. రోజువారీ ఆరోగ్య శాఖ మీడియా స‌మావేశంలో ఐసీఎంఆర్ ఉన్న‌తాధికారి డాక్ట‌ర్ మ‌నోజ్ మురేక‌ర్ మాట్లాడారు. దేశంలో ప్ర‌స్తుతం 219 ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. గ‌డిచిన ఐదు రోజుల్లో స‌గ‌టున రోజుకి 15,747 శాంపిల్స్ టెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు. స‌గ‌టున రోజుకు 584 శాంపిల్స్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలిపారు. దేశంలో 40 వ్యాక్సిన్స్ ప్ర‌యోగ ద‌శ‌లో ఉన్నాయ‌న్నారు.

13 దేశాల‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్

భార‌త్ లో అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ‌గానే హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ నిల్వ ఉన్నాయ‌ని చెప్పారు కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధి కేఎస్ ధ‌త్వాలియా. మ‌న‌కు అవ‌స‌రాల‌కు ఉంచుని, ఇత‌ర దేశాల‌కు సాయ‌ప‌డుతున్నామ‌ని చెప్పారు. 13 దేశాల‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమ‌తి చేసేందుకు భార‌త ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన‌ట్లు వివ‌రించారు.

లాక్ డౌన్ ఎత్తేసినా సోష‌ల్ డిస్టెన్స్ త‌ప్ప‌నిస‌రి

చైనా, జ‌పాన్, ద‌క్షిణ కొరియా దేశాల్లో క‌రోనా వ‌చ్చి క్యూర్ అయిన వారికి కూడా మ‌ళ్లీ వైర‌స్ సోకుతోంద‌ని, ఇది ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని అన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్. లాక్ డౌన్ ఉన్నా లేకున్నా సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం త‌ప్పనిస‌రి అని చెప్పారు. దేశంలో 80 శాతం క‌రోనా కేసులు మైల్డ్ ఇన్ఫెక్ష‌న్లు మాత్ర‌మేన‌ని, 20 శాతంలోపు కేసులు మాత్ర‌మే క‌్రిటిక‌ల్ కేర్ అవ‌స‌రం ఉంటుంద‌ని అన్నారు. ఈ ప్ర‌కారం ఏప్రిల్ 9 నాటికి 1100 బెడ్స్ అవ‌స‌రం కాగా.. 85 వేలు, నేటికి 1671 బెడ్స్ అవ‌స‌ర‌మైతే ల‌క్షా ఐదు వేల బెడ్స్ సిద్ధంగా ఉంచిన‌ట్లు తెలిపారు ల‌వ్ అగ‌ర్వాల్. దేశ వ్యాప్తంగా 601 కోవిడ్ ఆస్ప‌త్రుల్లో ఈ బెడ్స్ అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. మైల్డ్ ఇన్ఫెక్ష‌న్ ఉన్న పేషెంట్ల‌కు కేవిడ్ కేర్ సెంట‌ర్లు, మోడ‌రేట్ కేసుల‌కు కోవిడ్ హెల్త్ కేర్ సెంట‌ర్లు, క్రిటిక‌ల్ కేసుల‌కు కోవిడ్ ఆస్ప‌త్రుల్లో చికిత్స అందించేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు.