
మాస్కో:
రష్యాలోని ఈస్ట్రర్న్ సైబీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ప్రయాణికులతో బయల్దేరిన బస్సు బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోవడంతో 19 మంది చనిపోయారు. 22 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు. బస్సు బ్రిడ్జి క్రాస్ చేస్తుండగా దాని ముందు టైరు పగిలిపోవడంతో తలకిందులుగా నదిలో పడిందని, నదిలో నీళ్లు గడ్డకట్టి ఉండటంతో బస్సు సగం వరకు మంచులో కూరుకుపోయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని అతికష్టం మీద బయటకు తీసి హాస్పిటల్ కు తరలించినట్లు వెల్లడించారు.
అమెరికాలో విమాన ప్రమాదంలో 9 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలోని సౌత్ డకోటాలో విమానం కుప్పకూలింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, పైలట్‌తో సహా తొమ్మిది మంది చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 12 మందితో చామ్ బెర్లిన్ ఎయిర్ పోర్టు నుంచి గాల్లోకి లేచిన సింగిల్ ఇంజన్ టర్బోప్రాప్ విమానం కొద్దిసేపటికే కుప్పకూలిందని, మంచు తుఫాను వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురిని సియోక్స్ ఫాల్స్ లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచు తుఫాను హెచ్చరికలు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు.