
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మొత్తం 543 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 324 సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి రావచ్చని ఇండియా టుడే- సీఓటర్ నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే వెల్లడించింది. ఎన్డీయేకు 2024లో 293 ఎంపీ సీట్లు రాగా, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 324 సీట్లు రావచ్చని తెలిపింది.
బీజేపీ సొంతంగా 260 సీట్లు సాధిస్తుందని.. 2024 ఎన్నికల కంటే ఇరవై సీట్లు పెరుగుతాయని తెలిపింది. అయితే, బీజేపీ ఒంటరిగా పోటీచేసి మెజారిటీ (272 సీట్లు) సాధించే అవకాశం లేదని పేర్కొంది. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి 208 సీట్లను గెలుచుకోవచ్చని సర్వే తెలిపింది. ఇది 2024 (234 సీట్లు) కంటే తక్కువని చెప్పింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఓటు షేర్ 47%(2024) నుంచి 50%కి పెరిగే అవకాశం ఉందని, ఇండియా కూటమి ఓటు షేర్ 39% నుంచి 44%కి పెరుగుతుందని అంచనా వేసింది. అయినా, ఈ ఓటు షేర్ పెరుగుదల ఇండియా కూటమికి లాభం చేకూర్చదని పేర్కొంది.
ఎన్డీయేకు 46.7% ఓటు షేర్
ఈ ఏడాది జులై 1 నుంచి ఆగస్టు 14 మధ్య ఈ సర్వే చేపట్టారు. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో 54,788 మంది అభిప్రాయాలు సేకరించారు. అలాగే గత 24 వారాల్లో 1,52,038 మంది నుంచి.. మొత్తం 2,06,826 మంది ఓటర్ల అభిప్రాయాల ప్రకారం సర్వే రిపోర్ట్ రెడీ చేశారు.
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 46.7% ఓటు షేర్, ఇండియా కూటమికి 40.9% ఓటు షేర్ లభిస్తుందని.. ఇతరులకు 12.4% ఓటు షేర్ రావచ్చని సర్వే తేల్చింది. బీజేపీ 40.6% ఓటు షేర్‌తో 260 సీట్లు, కాంగ్రెస్ 20.8% ఓటు షేర్‌తో 97 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. ప్రధాని మోదీ దేశంలో అత్యంత ప్రజాదరణ గల నేతగా ఉన్నారు. తదుపరి ప్రధానిగా మోదీని 51.5%, రాహుల్ గాంధీని 24.7% మంది ఇష్టపడ్డారు.
అమెరికా టారిఫ్‌లపై 63% మంది ఆందోళన
అమెరికా విధించిన 50% టారిఫ్‌లపై దేశంలోని 63% మంది ఆందోళన చెందుతున్నారని.. 27% మంది ఆందోళన చెందలేదని సర్వే పేర్కొంది. అలాగే రష్యా చమురు కొనుగోలును 69% మంది సమర్థించారు. అయోధ్య రామాలయ నిర్మాణం అతిపెద్ద విజయమని16.7 % మంది చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ను 12.2% మంది సమర్థించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అత్యంత ప్రజాదరణ గల సీఎంగా నిలిచారు. 44.6% మంది ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.