
రఘునాథపల్లి, వెలుగు: యూట్యూబర్, నటుడు మొహమ్మద్ ఖాయ్యూం అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 12,500 జరిమానా విధిస్తూ జనగామ సివిల్ కోర్టు జడ్జి శశి తీర్పునిచ్చినట్లు గురువారం రఘునాథపల్లి ఎస్సై నరేశ్ యాదవ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మేడే లక్ష్మీనారాయణ, అతడి సోదరుడు మేడే కుమార్, పెంబర్తి మణెమ్మ, మరి కొంతమంది ఆటోలో 2018 మే 21న హైదారాబాద్ నుంచి మండలంలోని ఖిలాషాపూర్ కి వస్తుండగా, నిడిగొండ సమీపంలో హనుమకొండ నుంచి హైదారాబాద్ కు వెళ్తున్న లోబో అతివేగం, అజాగ్రత్తగా కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టాడు.
దీంతో ఆటోలోని వారికి తీవ్ర గాయాలవగా, చికిత్స పొందుతూ మేడే కుమార్, పెంబర్తి మణేమ్మ మృతిచెందారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు రఘునాథపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ చంద్రశేఖర్ ప్రమాదానికి కారణమైన లోబోపై కేసు నమోదు చేయగా, ప్రస్తుత సీఐ శ్రీనివాస్ రెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా జనగామ సివిల్ జడ్జి లోబో కు ఏడాదిపాటు జైల్ శిక్ష, రూ.12,500 జరిమానా విధించినట్లు తెలిపారు.