Delhi rains: ఢిల్లీలో వానబీభత్సం..పట్పర్ గంజ్ హైవే నిండా నీళ్లే..ఈత కొట్టి నిరసన తెలిపిన యువకులు

Delhi rains: ఢిల్లీలో వానబీభత్సం..పట్పర్ గంజ్ హైవే నిండా నీళ్లే..ఈత కొట్టి నిరసన తెలిపిన యువకులు

దేశ రాజధాని ఢిల్లీలో వానలు బీభత్సం సృష్టించాయి. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు నెలలో ఢిల్లీలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఢిల్లీలోని వీధులన్నీ జలమయమయ్యాయి.. ఎక్కడ చూసినా నీళ్లే.. సబ్ వేలు, అండర్ బ్రిడ్జీలు, రైల్వే్ ట్రాక్ లు, ప్రధాన రహదారులు ఇలా అన్ని చోట్లు వర్షపు నీరే. దీంతో ఢిల్లీ వాసులు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 29)  కురిసిన వర్షాలకు పట్పర్‌గంజ్ ప్రాంతంలోని వీధులు నీటితో నిండిపోయాయి. వీధుల పరిస్థితిని కొంతమంది యువకులు మోకాలి లోతు నీటిలో ఈత కొడుతూ, డైవింగ్ చేస్తున్నట్లు వ్యంగంగా తెలియజేస్తే చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో  నెటిజన్లు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

శుక్రవారం కురిసిన వర్షాలకు ఢిల్లీలో ఢిల్లీలోని పట్పర్‌గంజ్‌లోని NH24 పూర్తి జలమయమయింది. మోకాలు లోతుకంటే పైనే నీళ్లు రహదారిపై నిలిచాయి. వరదనీటిలో ఈత కొడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నాయి. నీటితో నిండిన వీధిలో యువకులు రోడ్డు మధ్యలో చిక్కుకున్న బస్సు పైకప్పు నుండి నీటిలోకి దూకుతున్న దృశ్యాలు ,మరో క్లిప్‌లో, వారు మోకాలి లోతు వరద నీటిలో ఈదుతున్న దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 

 గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు నెలలో ఢిల్లీలో అత్యధిక వర్షపాతం నమోదైంది.ఢిల్లీ వ్యాప్తంగా 399.8 మి.మీ ల వర్షపాతం కురిసింది. గత ఏడాది నమోదైన 390.3 మి.మీ వర్షపాతం కంటే ఇది చాలా ఎక్కువ. నగరంలో ఇప్పటికే రుతుపవనాల సగటు వర్షపాతం 774.4 మి.మీ. దాటింది. ఆగస్టు నెలలో ఇంకా రెండు రోజులు మిగిలి ఉండటంతో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. 

శుక్రవారం(ఆగస్టు 29)ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.30 గంటల మధ్య 63.7 మి.మీ వర్షపాతం నమోదు కాగా లోధి రోడ్‌లో 36.6 మి.మీ ,ఆయ నగర్‌లో 11.8 మి.మీ వర్షపాతం నమోదైందని IMD తెలిపింది. పశ్చిమ వినోద్ నగర్ ప్రాంతంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. భారీ వర్షం కారణంగా సంగం విహార్ నీమ్ చౌక్ రోడ్డులో నీరు నిలిచిపోయింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా దేశ రాజధానిలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు జలమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.