
తెలంగాణలోని అన్ని స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనసరి చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠశాలలనుంచి యూనివర్సిటీల వరకు ప్రతి విద్యా సంస్థలో మెరుగైన విద్యాబోధన, బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని కోరారు. ఫేషియల్ గుర్తింపుతో హాజరు శాతం పెరగడంతోపాటు లోటుపాట్లు అరికట్టవచ్చని సీఎం అన్నారు.
శుక్రవారం(ఆగస్టు29) హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంటగదులు, మూత్ర శాలలు, మరుగుదొడ్లు, ప్రహారీ గోడల నిర్మాణం వంటి పనులు చేపట్టడం సరికాదన్నారు. ఈ నిర్మాణల నాణ్యత ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనం ఒకే విభాగం కింద ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ (EWIDC) కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు కొనసాగాలని ఆదేశించారు. ఈ సంస్థకు అవసరమైన ఇంజినీరింగ్, ఇతర సిబ్బందిని ఇతర విభాగాల నుంచి వెంటనే డిప్యూటేషన్‌పై తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.
- గ్రీన్ ఛానల్‌లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపులు
- మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో టాయిలెట్స్, మరుగుదొడ్లు, ప్రహారీల నిర్మాణం
- కంటైనర్ కిచెన్లు, సోలార్ ప్యానెళ్లతో విద్యుత్
- ప్రతి స్కూళ్లో క్రీడలకు ప్రాధాన్యం ,కాంట్రాక్ట్ పద్దతిన పీఈటీలను నియామకం
- అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పాఠశాలల్లో పారిశుద్ధ్య పనుల బిల్లులు విడుదల
- సంక్షేమ గురుకులాల్లో బాలికలకోసం మహిళా కౌన్సెలర్లను నియమించాలి.
వంటి అంశాల్లో పనులు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీరాములు, విద్యా శాఖ సీఎస్ యోగితా రాణా , ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణారెడ్డి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.