వాషింగ్టన్: హెచ్1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 19 రాష్ట్రాలు కోర్టులో దావా వేశాయి. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ నేతృత్వంలో శుక్రవారం మసాచుసెట్స్ జిల్లా కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాయి. ‘‘సరైన విధివిధానాలు పాటించకుండా, చట్టపరమైన అనుమతి లేకుండా హెచ్1బీ వీసాల ఫీజును ట్రంప్ పెంచారు. దీనివల్ల అమెరికాలో డాక్టర్లు, నర్సులు, టీచర్లు, ఇతర వర్కర్లకు కొరత ఏర్పడుతుంది.
హెచ్1బీ వీసా విధానాన్ని ట్రంప్ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన చట్టసభల ఆమోదం లేకుండా అక్రమంగా ఫీజును పెంచారు. ఇది ఇమిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించడమే” అని అందులో పేర్కొన్నాయి. కాగా, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్తో, అమ్మాయిలతో తాను దిగిన ఫొటోలు బయటకు రావడంపై ట్రంప్ స్పందించారు. ‘‘అదేం పెద్ద విషయం కాదు. అతను (ఎప్‌స్టీన్) అందరికీ తెలుసు. వేలాది మందితో ఫొటోలు దిగాడు” అని అన్నారు.
