1983 వరల్డ్‌‌‌‌ కప్ విజయం ఇండియన్ క్రికెట్‎కు టర్నింగ్ పాయింట్: మంత్రి వివేక్

1983 వరల్డ్‌‌‌‌ కప్ విజయం ఇండియన్ క్రికెట్‎కు టర్నింగ్ పాయింట్: మంత్రి వివేక్

హైదరాబాద్, వెలుగు: కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఇండియా క్రికెట్ టీమ్ 1983 వరల్డ్‌‌‌‌ కప్ గెలవడం మన దేశ క్రికెట్ కు టర్నింగ్ పాయింట్ అని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆ విజయం దేశ క్రికెట్ గతినే మార్చేసిందని, మన జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందని చెప్పారు. 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో భాగస్వామి అయిన ఇండియా టీం మాజీ వికెట్ కీపర్, హైదరాబాదీ సయ్యద్ కిర్మాణీ ఆత్మకథ ‘స్టంప్డ్: లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద ట్వంటీ టూ యార్డ్స్’ను మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ క్రికెటర్లు మొహిందర్ అమర్‌‌‌‌నాథ్, మహ్మద్‌‌‌‌ అజారుద్దీన్, టీమిండియా పేసర్‌‌‌‌ మహ్మద్ సిరాజ్ కలిసి ఆవిష్కరించారు. 

ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని ఓ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్‌‌‌‌ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సయ్యద్ కిర్మాణీ వంటి గొప్ప క్రికెటర్ ఆత్మకథను ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ‘‘కిర్మాణీ తన పుస్తకాన్ని హైదరాబాద్‌‌‌‌లో విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసినప్పుడు, ఒక హైదరాబాదీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వంగా అనిపించింది” అని వెల్లడించారు. 

‘‘మా యంగ్‌‌‌‌ ఏజ్‌‌‌‌లో ఎల్బీ స్టేడియంలో క్రికెట్ నేర్చుకునేవాళ్లం. అప్పట్లో మొహిందర్ అమర్‌‌‌‌నాథ్ వీఎస్టీ కోల్ట్స్ తరఫున ఆడేవారు. సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్నారు. ఈ క్రమంలో 1983 వరల్డ్ కప్ విజయం ఇండియన్‌‌‌‌ క్రికెట్ గతిని మార్చిన ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఆ చరిత్రాత్మక విజయంలో భాగమైన కిర్మాణీ ఆత్మకథ, ఆయన జీవితం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. జీవితంలో ఎంత దృఢ సంకల్పంతో ఉండాలి? లక్ష్య సాధనలో సవాళ్లను తట్టుకునే శక్తిని ఎలా పెంచుకోవాలన్న విషయాలకు ఆయన జీవితమే నిలువుటద్దం” అని కొనియాడారు.  

కిర్మాణీ చాలా మంచోడు: మొహిందర్ అమర్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌ 

కిర్మాణీ తనకు మంచి స్నేహితుడని, తాము స్కూల్ ఏజ్ నుంచే కలిసి క్రికెట్ ఆడామని మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్‌‌‌‌నాథ్ తెలిపారు. టీమ్‌‌‌‌ మేట్స్ అందరం కిర్మాణీని ముద్దుగా కిరి మియా అని పిలిచేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. కిర్మాణీ చాలా మంచి వ్యక్తి అని, తన ఆటతో వికెట్ కీపింగ్‌‌‌‌కు వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయన ఆత్మకథ సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. 

కిర్మాణీ నాకు స్ఫూర్తి: సిరాజ్‌‌‌‌

సయ్యద్ కిర్మాణీ తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని మహ్మద్ సిరాజ్‌‌‌‌ అన్నారు. ‘‘1983లో వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గినప్పుడు నేను పుట్టనేలేదు. కానీ, ఆయన గురించి నేను చాలా విన్నాను. ఎంతో మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచారు.‌‌‌‌ ఇండియన్ క్రికెట్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఆయన చేసిన సేవలకు థ్యాంక్స్‌‌‌‌’’ అని కొనియాడారు. కాగా, సునీల్ గవాస్కర్‌‌‌‌‌‌‌‌, కపిల్ దేవ్‌‌‌‌, శ్రీకాంత్, సానియా మీర్జా తమకు కిర్మాణీతో ఉన్న అనుబంధాన్ని, ఆయన సేవలను తమ వీడియో సందేశాల్లో గుర్తు చేసుకున్నారు. 

క్రికెట్ కోసం వివేక్ ముందుంటారు: అజారుద్దీన్‌‌‌‌

సయ్యద్ కిర్మాణీతో కలిసి ఆడటం తన అదృష్టమని మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. తాను తొలిసారి ఇండియా జట్టులోకి వచ్చినప్పుడు కిర్మాణీ తనను ఎంతగానో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. తాను చూసిన బెస్ట్‌‌‌‌ వికెట్ కీపర్లలో కిర్మాణీ ఒకరని కొనియాడారు. బుక్ లాంచ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ను హోస్ట్ చేసిన మంత్రి వివేక్‌‌‌‌కు అజార్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ కోసం ఆయన ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో వివేక్‌‌‌‌, వినోద్‌‌‌‌ కృషి మరలేనిదని ప్రశంసించారు.

క్రీడల అభివృద్ధికి సర్కారు కృషి 

తెలంగాణలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి వివేక్ తెలిపారు. ‘‘నిజానికి ఈ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో ఒక అత్యవసర సమావేశం వల్ల ఆయన రాలేకపోయారు. అందుకే, హైదరాబాద్ నుంచి ఇండియా క్రికెట్ టీమ్‌‌‌‌కు ఐకాన్‌‌‌‌గా మారిన మహ్మద్ సిరాజ్‌‌‌‌ను పిలిచాం’’ అని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుందని, ఫ్యూచర్ సిటీలో అల్ట్రా మోడ్రన్ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ప్రకటించారు. 

ఇప్పటికే సిరాజ్‌‌‌‌, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌‌‌‌లకు డీఎస్పీ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం, నగదు బహుమతులు అందించామన్నారు. రాష్ట్ర క్రీడాకారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలని సూచించారు. అజారుద్దీన్, శివలాల్ యాదవ్, సిరాజ్‌‌‌‌ వంటి వారు హైదరాబాద్ క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారి స్ఫూర్తితో నేటి తరం ముందుకు సాగాలన్నారు.

మంత్రి వివేక్‌‌‌‌కు థ్యాంక్స్‌‌‌‌: కిర్మాణీ 

తన ఆత్మకథను హైదరాబాద్‌‌‌‌లో ఆవిష్కరించేందుకు మంత్రి వివేక్‌‌‌‌ ముందుకొచ్చి అన్ని విధాలుగా సహకరించారని కిర్మాణీ చెప్పారు. తన పుట్టుక నుంచి ఇప్పటివరకూ అన్నింటినీ ఆత్మకథలో పొందుపర్చానని వెల్లడించారు.    సీఎం రేవంత్ రెడ్డి తనతో 30 నిమిషాల పాటు ఆప్యాయంగా మాట్లాడారని, తాను చూసిన సీఎంలలో ఏ మాజీ క్రికెటర్‌‌‌‌తోనూ ఇంతసేపు మాట్లాడినవారు లేరన్నారు.

 ‘‘తాను ఫుట్ బాల్ ప్లేయర్‎ను అని సీఎం చెప్పారు. 1983 వరల్డ్ కప్ సమయంలో తమ ఇంటికి కలర్ టీవీ వచ్చిందని, ఆ రోజుల్లో కపిల్ దేవ్, సయ్యద్ కిర్మాణీ మాత్రమే తనకు తెలుసని చెప్పడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అని కిర్మాణీ తెలిపారు. 1983 వరల్డ్ కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ జ్ఞాపకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‌‌‌‌ఇటీవల ముగిసిన ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి దేశ గౌరవాన్ని నిలబెట్టాడని ప్రశంసించారు. సిరాజ్ వరల్డ్ బెస్ట్‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌గా ఎదగాలని ఆకాంక్షించారు.