హ్యాట్సాఫ్ ఇండియా : పాకిస్తానీ యువతికి.. భారతీయుడి గుండె..

హ్యాట్సాఫ్ ఇండియా : పాకిస్తానీ యువతికి.. భారతీయుడి గుండె..

కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. ప్రాణానికి ప్రాంతాలతోనే సంబంధం లేదు.. మనుషులు వేరయినా వారిలో ప్రవహించే రక్తం ఎర్రగానే ఉంటుంది, జాతి ఏదైనా గుండె చప్పుడు ఒకటే, ప్రతి గుండె నిమిషానికి 72 సార్లే కొట్టుకుంటుంది.. మతం, ప్రాంతానికి మానవత్వం అనేది అతీతం అని నిరూపించింది ఇండియా.. చెన్నై సిటీలో ఓ యువతికి జరిగిన గుండె ఆపరేషన్ భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఆసక్తిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆమె పేరు అయేషా రషన్. 19 సంవత్సరాల యువతి.. పాకిస్తాన్ దేశానికి చెందిన మహిళ. అయేషాకు 2019లో హార్ట్ అటాక్ వచ్చింది, ఆ తర్వాత హార్ట్ ఫెయిల్ అవ్వటంతో అడయార్ లోని మలార్ హాస్పిటల్ ను సంప్రదించారు.

ఆయేషాను పరీక్షించిన డాక్టర్లు ఆమెకు ఎడమవైపు గుండె డ్యామేజ్ అయ్యిందని గుర్తించి ఎడమ వైపు కృత్రిమ భాగాన్ని అమర్చారు. ఆ తర్వాత 2023లో కుడి వైపు గుండె కూడా డ్యామేజ్ అవ్వడంతో ఆయేషా ఇన్ఫెక్షన్ కు గురైంది. దీంతో ఆయేషా తండ్రి డాక్టర్లను సంప్రదించగా గుండె మార్పిడి ఒక్కటే మార్గమని తెలిపారు. గుండె మార్పిడి కోసం ఆయేషా పేరును వెయిటింగ్ లిస్ట్ లో చేర్చుతున్నామని, స్వదేశంలో గుండె మార్పిడి కోసం వెయిట్ చేసే పేషంట్స్ ఎవరు లేకున్నప్పుడే విదేశీయులకు గుండె కేటాయిస్తారని సెప్టెంబర్ 2023లో  చెన్నై డాక్టర్లు తెలిపారు.

ఆ తర్వాత అయేషాకు గుండె మార్పిడి కోసం గుండె అలాట్ చేయబడిందని తండ్రి రోషన్ కు డాక్టర్లు కాల్ చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన 69ఏళ్ళ వ్యక్తి గుండెను అయేషాకు అమర్చేందుకు డాక్టర్లు సిద్ధమయ్యారు. గుండె మార్పిడి తప్ప, అయేషాకు వేరే ఆప్షన్ లేదని తెలుసుకున్న డాక్టర్లు రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆపరేషన్ సజావుగా జరిగి, ప్రస్తుతం ఆయేషా లైఫ్ సపోర్ట్ సిస్టం సహాయం లేకుండానే ఉండగలుగుతుంది. ఏప్రిల్ 17న డిశ్చార్జ్ అయింది ఆయేషా.  ఆయేషా ఆపరేషన్ కోసం ఐశ్వర్య ట్రస్ట్ విరాళాలు సేకరించి సాయపడింది. గుండె మార్పిడి కోసం 35లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు.