
హైదరాబాద్, వెలుగు: కొన్న ఫ్లాట్లను ఆలస్యంగా అప్పగించినందుకు కస్టమర్లకు పరిహారం ఇవ్వాలని మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భాగస్వాములను రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ప్రెసిడెంట్ ఎంఎస్‌కే జైస్వాల్ ఆదేశించారు. ఇస్తానన్న టైంకు ఫ్లాట్ అప్పగించకపోవడం అనుచిత వ్యాపారం కిందికే వస్తుందన్నారు. హైదరాబాద్‌కు చెందిన వేముగంటి సత్యవతి, ప్రవీణ్‌బాబు దంపతులు గచ్చిబౌలిలోని మంత్రి సెలెస్టియా టౌన్ షిప్‌లో ఫ్లాట్‌కు డబ్బులిచ్చి 2009 సెప్టెంబర్ 20న అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫ్లాట్‌ను 2011 డిసెంబర్ 31 నాటికి ఇస్తామన్న బిల్డర్లు 2015 మార్చి 14న అందజేశారు. దీంతో ప్రవీణ్‌బాబు దంపతులు టీఎస్‌సీడీఆర్‌సీని ఆశ్రయించారు. కేసును విచారించిన జైస్వాల్.. 36 నెలల ఆలస్యానికి రూ.1,29,600 పరిహారంతో పాటు అసౌకర్యానికి రూ. లక్ష, కోర్టు ఖర్చులకు రూ.10 వేలు నాలుగు వారాల్లో చెల్లించాలని తీర్పునిచ్చారు.