
- నేషనల్ హైవే 765 డీజీ పక్కన 125 ఎకరాల విస్తీర్ణంలో పార్క్ఏర్పాటు
- మొదలైన మెయిన్ గేట్, ప్రహరీ, వాచ్ టవర్, గజిబో నిర్మాణ పనులు
- పార్క్ లో వన విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కు ప్రణాళిక
మెదక్/రామాయంపేట, వెలుగు: జిల్లాలో ఇదివరకు 3 అర్బన్ పార్క్ లు ఏర్పాటు చేయగా తాజాగా మరో అర్బన్ పార్క్ రూపుదిద్దుకుంటోంది. రామాయంపేట మండల పరిధి అక్కన్నపేట ఫారెస్ట్ ఏరియాలో నగర వన యోజన పథకం కింద దీనిని ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ వాసులకు ప్రశాంతమైన వాతావరణం కరువవుతోంది. వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వీకెండ్స్ లో పార్కులలో సేదతీరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నగర వన యోజన పథకం కింద పట్టణాలకు సమీప ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో అర్బన్ పార్క్ లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మెదక్ పట్టణం నుంచి రామాయంపేట పట్టణానికి వెళ్లే మార్గంలో 765 డీజీ నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న అక్కన్నపేట ఫారెస్ట్ ను అర్బన్ పార్క్ ఏర్పాటుకోసం ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నగర వన యోజన పథకం కింద రూ.2 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు
మొదలుపెట్టారు.
125 ఎకరాల విస్తీర్ణంలో..
నేషనల్ హైవే పక్కన ఉన్న ఫారెస్ట్ లో 125 ఎకరాల విస్తీర్ణాన్ని అర్బన్ పార్క్ డెవలప్ మెంట్ కోసం కేటాయించారు. సందర్శకులు లోనికి వెళ్లేందుకు వీలుగా హైవే పక్కనే మెయిన్ ఎంట్రెన్స్ నిర్మిస్తున్నారు. దీనిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అర్బన్ పార్క్ ఏరియా చుట్టూరా ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారు. అడవి అందాలను తిలకించేందుకు వీలుగా ఎత్తైన వాచ్ టవర్, సందర్శకులు సేద తీరేందుకు ఆకర్షణీయమైన గజిబో నిర్మాణ పనులు చేపట్టారు.
పార్క్ ఏరియాలో అడవిలో తిరిగేందుకు బాటలు ఏర్పాటు చేయడంతో పాటు, మౌలిక వసతులు కల్పించనున్నారు. అడవులు, వన్య ప్రాణులు, వాటి జీవన విధానాన్ని తెలియజేసేలా పార్క్ లో వన విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అక్కన్న పేట అర్బన్ పార్క్ పూర్తి అయితే అటు రామాయంపేట, ఇటు మెదక్ పట్టణ వాసులకు, పరిసర మండలాల ప్రజలకు, మెదక్ నుంచి సిద్దిపేట, వరంగల్ రూట్లో నేషనల్ హైవే మీదుగా రాకపోకలు సాగించే వాహన దారులు ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు అవకాశం ఉంటుంది.