వాషింగ్టన్: అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. శనివారం (డిసెంబర్ 14) ఫైనలియర్ పరీక్షలు జరుగుతుండగా గుర్తు తెలియని దుండగుడు సామూహిక కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్యాంపస్‌ను అదుపులోకి తీసుకుని అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై ప్రావిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ మాట్లాడుతూ.. బ్రౌన్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్లు ఉన్న ఏడు అంతస్తుల బారస్, హోలీ భవనం సమీపంలో కాల్పులు జరిగాయని తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. 8 మంది గాయపడ్డారని చెప్పారు.
ఇంజనీరింగ్ డిజైన్ పరీక్షలు జరుగుతున్న సమయంలో కాల్పులు జరిగినట్లు తెలిపారు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారని.. అధికారులు ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ప్రకటించే వరకు సమీపంలోని నివాసితులు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఈ ఘటనపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఎఫ్‌బీఐ ఘటన స్థలంలో దర్యాప్తు చేస్తోందని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
